Let's talk: editor@tmv.in
ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్

Gaddamidi Naveen
18 జూన్, 2026

రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి కరీంనగర్ వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు ఆర్టీసీ బస్సులో సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణించారు. ఈ సందర్భంగా బస్సులోని విద్యార్థులు, ప్రయాణికులతో మంత్రులు ఆత్మీయంగా ముచ్చటించి, వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. స్కూళ్లు, కాలేజీల సమయానికి అనుగుణంగా అదనపు బస్సులు నడుపుతున్నామని తెలిపారు. 'మహాలక్ష్మి' పథకం ద్వారా పెరిగిన ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కొత్త బస్సులను కొనుగోలు చేశామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా పాలన ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడమే కాకుండా, వారిని ఆర్టీసీ బస్సులకు యజమానులను చేసిందని పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఒక్కో మహిళ నెలకు రూ.2,000 నుంచి రూ.3,000 వరకు ఆదా చేసుకుంటున్నారని వివరించారు.

గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూసిందని విమర్శిస్తూ.. ప్రస్తుత ప్రభుత్వం కొత్త రూట్లలో బస్సులు నడుపుతోందని మంత్రి చెప్పారు. కార్మికుల సమస్యలను పరిష్కరిస్తున్నామని, కార్మిక సంఘాల ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని తెలిపారు. ఎన్నికలు పూర్తికాగానే గెలిచిన సంఘం నాయకులతో అధికారుల కమిటీలో విలీన ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. పీఆర్సీ ప్రకటన, గుర్తింపు సంఘాల ఎన్నికల నిర్వహణపై ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు సంతోషం వ్యక్తం చేశారు. ప్రయాణికులతో ప్రేమపూర్వకంగా మాట్లాడాలని, వారికి అసౌకర్యం కలిగించవద్దని ఈ సందర్భంగా సిబ్బందికి సూచించారు.

గురుకుల పాఠశాలల్లో మెస్, కాస్మొటిక్ చార్జీలను పెంచామని, నైపుణ్యం గల అధ్యాపకులతో నాణ్యమైన విద్యనందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రీ-ప్రైమరీ పాఠశాలలను ప్రారంభించడంతో పాటు ప్రభుత్వ స్కూళ్లలో 'బ్రేక్‌ఫాస్ట్ మిల్క్' పథకాన్ని తెచ్చామన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్, సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఉద్యోగ నియామకాలు, రైతు భరోసా, రుణమాఫీ వంటి అనేక పథకాలను అమలు చేస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలిచిన పేదల ప్రభుత్వం తమదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.