

మేడారం అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి: మంత్రులు ఆదేశం
ములుగు జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రం మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతల ఆలయాల అభివృద్ధి పనులను అత్యంత వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క అధికారులను ఆదేశించారు. ఆదివారం మంత్రులిద్దరూ స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి మేడారంలో పర్యటించి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హరిత హోటల్‌లో అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
మేడారం ఆలయ ప్రాంగణాన్ని భక్తుల కోసం అత్యంత వైభవంగా తీర్చిదిద్దాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. తుది దశలో ఉన్న పునర్నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో రాతి కట్టడాలు ఎక్కడా ఖాళీలు లేకుండా, ఫ్లోరింగ్ సమానంగా ఉండేలా చూడాలని సూచించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రధాన ద్వారాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆలయంలో నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థను ప్రధాన రహదారి డ్రైనేజీతో అనుసంధానించాలని, రహదారికి ఇరువైపులా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని ఆదేశించారు. భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా ఫేజ్-2 అభివృద్ధి పనుల కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, అలాగే మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కూడా ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ దివాకర్‌ను ఆదేశించారు.
బాధిత కుటుంబానికి అండ
ఇటీవల ప్రమాదానికి గురైన స్థానిక పూజారి కుటుంబానికి చెందిన బాలుడి విషయంలో మంత్రి పొంగులేటి స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారని, బాలుడి వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అతనికి అత్యాధునిక కృత్రిమ అవయవం ఏర్పాటు చేయడంతో పాటు కుటుంబానికి పూర్తి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
మంత్రులు నార్లాపూర్ గ్రామంలో ఆవుల లక్ష్మి, రాజు దంపతులకు చెందిన 'ఇందిరమ్మ ఇల్లు'ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఏఎస్పీ మనన్ భట్, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భక్తుల కోసం మెరుగైన సేవలందించేందుకు సిబ్బంది సంఖ్యను పెంచే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి సీతక్క ఈ సందర్భంగా అధికారులను కోరారు.
