
ఏపీ సచివాలయంలో ‘లిడ్ క్యాప్’ లెదర్ షోరూమ్ ప్రారంభించిన మంత్రులు
కుల వృత్తిదారులకు శాశ్వత ఉపాధి, ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఆధునిక పరికరాలను అందజేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాలవీరాంజనేయ స్వామి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. చర్మకారుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని వారు పేర్కొన్నారు.
బుధవారం అమరావతిలోని ఏపీ సచివాలయం నాలుగో భవనంలో ఏర్పాటు చేసిన లిడ్ క్యాప్ లెదర్ షోరూమ్ (ఔట్‌లెట్)ను మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, లిడ్ క్యాప్ ద్వారా చర్మకారులకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. మార్కాపురం జిల్లా యడవల్లి, కృష్ణా జిల్లా జి. కొండూరులో లెదర్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను విస్తరిస్తున్నామని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లిడ్ క్యాప్‌కు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా చర్యలు చేపట్టామని చెప్పారు.
మంత్రి ఎస్. సవిత మాట్లాడుతూ, కుల వృత్తిదారులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆధునిక పరికరాల పంపిణీ ద్వారా వారి ఆదాయం పెరిగేలా కృషి చేస్తున్నామని తెలిపారు. సచివాలయంలో లిడ్ క్యాప్ ఔట్‌లెట్ ఏర్పాటు కావడంతో ఉద్యోగులు, సందర్శకులకు నాణ్యమైన లెదర్ ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయని, సచివాలయ ఉద్యోగులకు 10 శాతం రాయితీతో విక్రయాలు నిర్వహిస్తామని వెల్లడించారు.
లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ, చర్మకారుల అభివృద్ధికి సంస్థ కట్టుబడి పనిచేస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో కబ్జాకు గురయ్యే పరిస్థితి నుంచి లిడ్ క్యాప్ భూములను రక్షించామని, నాణ్యమైన తోలు ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. షోరూమ్ ప్రారంభోత్సవం అనంతరం మంత్రులు డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎస్. సవిత స్వయంగా లెదర్ ఉత్పత్తులను కొనుగోలు చేశారు.
