
తుమ్మిడిహెట్టి వద్ద క్షేత్రస్థాయిలో మంత్రుల సమీక్ష
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సాగునీటి అవసరాలను తీర్చేందుకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన తుమ్మిడిహెట్టి (ప్రాణహిత-చేవెళ్ల) ప్రాజెక్టును పునరుద్ధరించేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి ఈ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి, పనుల పురోగతిని సమీక్షించారు.
ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితులు, ఇప్పటికే జరిగిన పనులు, భవిష్యత్ కార్యాచరణపై అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించారు. ప్రాణహిత–చేవెళ్ల సుజల స్రవంతి పథకంలో భాగమైన తుమ్మిడిహెట్టి బరాజ్‌కు 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భూమిపూజ చేశారు. రూ.38,500 కోట్ల అంచనా వ్యయంతో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. ఇందులో భాగంగా 106 కిలోమీటర్ల మేర కాల్వల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయగా, ఇప్పటివరకు 71.5 కిలోమీటర్ల మేర భూసేకరణ పూర్తయిందని. అలాగే 46 కిలోమీటర్ల కాల్వల నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయని పేర్కొన్నారు.
మంత్రులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును పక్కనపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టుపై దృష్టి కేంద్రీకరించిందన్నారు. గ్రావిటీ ద్వారా మళ్లించాల్సిన నీటిని పంపుల ద్వారా ఎత్తిపోసే విధానాన్ని ఎంచుకోవడంతో ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగిందని, దీనివల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం కూడా అధికమైందని పేర్కొన్నారు. తలాపున నదీజలాలు ఉన్నప్పటికీ సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాల ప్రజలు, రైతులకు ఆశించిన ప్రయోజనం అందలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రజా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరలోనే చర్చలు జరుపుతామని మంత్రులు చెప్పారు.
ప్రాజెక్టు నిర్మాణం వల్ల భూములు కోల్పోయే రైతులకు తగిన పరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులు స్పష్టం చేశారు. ఈ నెల 10న ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు రానున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ ప్రజాప్రతినిధులు ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోవడంతో ఆ జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునే పరిస్థితి లేదని పేర్కొన్న మంత్రులు, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ద్వారా గ్రావిటీ పద్ధతిలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీటిని తరలిస్తామని తెలిపారు. ఒక్క యూనిట్ విద్యుత్ వినియోగం లేకుండానే నీటిని మళ్లించడం ద్వారా వ్యయాన్ని తగ్గించడంతో పాటు ప్రాంతీయ రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం కలుగుతుందని అన్నారు.
