

నర్సాపూర్‌లో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన
నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి పునరుద్ఘాటించారు. శనివారం నర్సాపూర్‌లో పర్యటించిన ఆయన, రూ.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పట్టణ అభివృద్ధి కోసం ప్రత్యేక మున్సిపల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఒక క్రమబద్ధమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం
పర్యటనలో భాగంగా 4, 6వ వార్డుల్లో ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం కింద నిర్మించిన ఇళ్లకు మంత్రి ప్రారంభోత్సవం చేశారు. లబ్ధిదారులు దుడ్డల దుర్గమ్మ, మహమ్మద్ షకీరా బేగం కుటుంబాలతో కలిసి గృహప్రవేశం వేడుకల్లో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. నిలువ నీడ లేని నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
అనంతరం నారాయణపూర్ గ్రామంలో 99 రోజుల 'ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక'లో భాగంగా “బడిబాట” (పాఠశాల నమోదు కార్యక్రమం)ను మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తున్నామని, విద్యార్థుల నమోదును పెంచేందుకు అధికారులు, తల్లిదండ్రులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
సభను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు చేరాలని ఆకాంక్షించారు. ఎండకాలంలో తాగునీటి ఎద్దడి కలగకుండా ప్రజాప్రతినిధులు ముందస్తుగా స్పందించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యతాయుతంగా సేవ చేయాలని, కొత్తగా ఎన్నికైన సభ్యులు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజల చెంతకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ లక్ష్మి రాజ్ యాదవ్ ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
