Let's talk: editor@tmv.in
కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌తో మంత్రి వాకిటి శ్రీహరి భేటీ
కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌తో మంత్రి వాకిటి శ్రీహరి భేటీ

కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌తో మంత్రి వాకిటి శ్రీహరి భేటీ

Gaddamidi Naveen
29 ఏప్రిల్, 2026

తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఎన్‌ఎఫ్‌డీబీ) కార్యాలయంలో కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌‌కు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో మత్స్యశాఖ డైరెక్టర్ నిఖిల, పశుసంవర్ధక శాఖ అధికారి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో అమలు చేస్తున్న పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ పథకాల గురించి కేంద్ర మంత్రికి శ్రీహరి వివరించారు. ఈ పథకాల ద్వారా లభిస్తున్న సత్ఫలితాలను వివరిస్తూనే, రాష్ట్ర అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిరంతర సహకారం కావాలని కోరారు. ముఖ్యంగా ఆక్వాకల్చర్ అభివృద్ధికి అవసరమైన మద్దతు, జీవశాస్త్ర రంగంలో బీమా సౌకర్యాల విస్తరణ, మోపెడ్లు వంటి వనరుల పంపిణీలో న్యాయమైన కేటాయింపులు ఉండాలని కోరారు. ఈ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ, కేంద్రం అనేది రాష్ట్రాల సమాఖ్య కావడంతో అన్ని రాష్ట్రాలకు నిధులు సమానంగా కేటాయించాల్సిన బాధ్యత ఉందన్నారు. గత ప్రభుత్వం తెలంగాణకు కేంద్ర నిధులను సమర్థంగా రాబట్టడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను ప్రస్తావిస్తూ, గోదావరి–కృష్ణా నదుల మధ్య ఉన్న 46,000 పెద్ద చెరువులు, 26,000 చిన్న చెరువులు, 100 రిజర్వాయర్ల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ చర్యల ద్వారా మత్స్యశాఖతో పాటు పశుసంవర్ధక రంగాలకు కూడా ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.

అలాగే రాజేంద్రనగర్ నుంచి ఎన్‌ఎఫ్‌డీబీని కార్యాలయాన్ని తరలించే యోచనలపై వచ్చిన వార్తలను కూడా ఈ సమావేశంలో ప్రస్తావించారు. దీనిపై కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ స్పందిస్తూ, ఎన్‌ఎఫ్‌డీబీని తరలించే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసి, అదే స్థానంలో కొనసాగుతుందని భరోసా ఇచ్చారు. సమావేశం అనంతరం మంత్రి వాకిటి శ్రీహరి, కేంద్ర మంత్రిని శాలువా, పుష్పగుచ్ఛం, స్మారక చిహ్నంతో సత్కరించారు.

కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌తో మంత్రి వాకిటి శ్రీహరి భేటీ - Tholi Paluku