Let's talk: editor@tmv.in
‘థ్రెడ్ పోచంపల్లి’ చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
‘థ్రెడ్ పోచంపల్లి’ చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

‘థ్రెడ్ పోచంపల్లి’ చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Gaddamidi Naveen
6 జూన్, 2026

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “తెలంగాణ రైజింగ్” కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన “థ్రెడ్ పోచంపల్లి” చేనేత వస్త్ర ప్రదర్శనను రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. జూన్ 7 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పోచంపల్లి ఇక్కత్ చేనేత కళకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రత్యేక గుర్తింపును ప్రస్తావిస్తూ, ఇక్కడి నేతన్నల నైపుణ్యం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు.

వేల సంవత్సరాల చరిత్ర కలిగిన చేనేత సంప్రదాయాన్ని భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి అన్నారు. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలకు లభించిన జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) ట్యాగ్, ఇక్కడి కళాకారుల సృజనాత్మకతకు నైపుణ్యానికి దక్కిన అంతర్జాతీయ గుర్తింపని ఆయన వివరించారు. భూదాన్ ఉద్యమానికి చారిత్రక కేంద్రంగా నిలిచిన పోచంపల్లికి ప్రత్యేక స్థానం ఉందని పేర్కొంటూ, పోచంపల్లి రుమాళ్లు, ఇక్కత్ చీరలకు ప్రపంచ మార్కెట్‌లో మరింత ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

చేనేత రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని స్పష్టం చేసిన మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గత రెండున్నర సంవత్సరాల కాలంలో చేనేత రంగం అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం రూ.1,400 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలిపారు. నేతన్నల ఉపాధికి ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని ఆయ‌న హామీ ఇచ్చారు.

గ్లోబలైజేషన్ పోటీని సమర్థంగా ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)ను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సంస్థ ద్వారా చేనేత కుటుంబాల పిల్లలకు ఆధునిక డిజైన్లు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ అవసరాలకు అనుగుణమైన శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. తద్వారా వారు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే సామర్థ్యాన్ని పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్, చేనేత సహకార సంఘాల ప్రతినిధులు, చేనేత కార్మికులు, పలువురు కళాకారులు పాల్గొన్నారు.

100కు పైగా స్టాళ్లతో చేనేత జాతర

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన చేనేత కార్మికులు, తయారీదారుల నుంచి నేరుగా సేకరించిన ప్రామాణికమైన చేనేత వస్త్రాలు, లగ్జరీ చీరలు, ఆధునిక దుస్తులతో కూడిన 100కు పైగా ప్రత్యేక స్టాళ్లను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇది కేవలం ఒక వ్యాపార ప్రదర్శన మాత్రమే కాదు, ఒక సజీవ సాంస్కృతిక పర్యావరణ వ్యవస్థగా నిలవబోతోంది.

ఈ కార్యక్రమం కేవలం ఒక ప్రదర్శనగా మాత్రమే కాకుండా, యాదాద్రి భువనగిరి జిల్లాలోని గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహించే తొలి అడుగుగా భావిస్తున్నారు. హైదరాబాద్‌కు కేవలం రెండు గంటల దూరంలో ఉన్న పోచంపల్లిని వీకెండ్ పర్యటనల గమ్యస్థానంగా పరిచయం చేయడమే లక్ష్యంగా పర్యాటక మార్గాలను కూడా సందర్శకులకు తెలియజేయనున్నారు. సంప్రదాయం, కళ, సంస్కృతి, గ్రామీణ జీవన శైలిని ఒకే వేదికపై ఆవిష్కరించే ఈ ప్రదర్శన నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకునే అవకాశం ఉంది.