Let's talk: editor@tmv.in
మండుటెండలో సైకిల్‌పై సీఎం క్యాంపు కార్యాలయానికి మంత్రి!
మండుటెండలో సైకిల్‌పై సీఎం క్యాంపు కార్యాలయానికి మంత్రి!

మండుటెండలో సైకిల్‌పై సీఎం క్యాంపు కార్యాలయానికి మంత్రి!

Dantu Vijaya Lakshmi Prasanna
16 మే, 2026

దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలు, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించి, పొదుపు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపునకు ఏపీ ప్రభుత్వం సంఘీభావం తెలిపింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ‘నో వెహికల్ డే’ను నిర్వహిస్తోంది. ఈ పిలుపును బాధ్యతగా స్వీకరించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, తన అధికారిక కాన్వాయ్‌ను పక్కనపెట్టి విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుండి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కుకుంటూ వెళ్లారు.

ఎండను సైతం లెక్కచేయక

వేసవి మండుటెండను సైతం లెక్కచేయకుండా మంత్రి నిమ్మల రామానాయుడు సాధారణ పౌరుడిలా సైకిల్‌పై ప్రయాణించడం అందరి దృష్టిని ఆకర్షించింది. తన వ్యక్తిగత సౌకర్యం కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని ఆయన ఈ సందర్భంగా చాటిచెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరుగుతున్న పోలవరం నిర్వాసితుల పరిహారం పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఈ విధంగా సైకిల్‌పై వెళ్లడం చర్చనీయాంశమైంది. ఇంధన పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించడమే తన ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

పోలవరం నిర్వాసితులకు అండగా..

ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్న మంత్రి, అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితులకు ప్రభుత్వం తరపున దాదాపు రూ. 307 కోట్ల పరిహారాన్ని, అలాగే పట్టాలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. నిర్వాసితుల కష్టాలను గుర్తించి, వారికి సకాలంలో న్యాయం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, జలవనరుల శాఖ మంత్రిగా ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

వైసీపీ విమర్శలపై ధ్వజం

ఇదే క్రమంలో విపక్షాల తీరుపై మంత్రి నిమ్మల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భవిష్యత్ తరాల కోసం, దేశ ఆర్థిక వ్యవస్థ పరిరక్షణ కోసం ప్రధాని మోడీ , సీఎం చంద్రబాబులు పొదుపు చర్యలు చేపడుతుంటే.. వైసీపీ నేతలు వాటిని అవహేళన చేయడం బాధాకరమని అన్నారు. ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయ విమర్శలకే వారు ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇలాంటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు సరికావని ఆయన హితవు పలికారు. ప్రతి ఒక్కరూ దేశ భవిష్యత్తు కోసం తమ వంతుగా ఇంధన పొదుపును బాధ్యతగా తీసుకోవాలని కోరారు.