
హైదరాబాద్‌లో హైనెకెన్ గ్లోబల్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు బుధవారం హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ప్రపంచ ప్రఖ్యాత మద్యం తయారీ సంస్థ హైనెకెన్ ఏర్పాటు చేసిన ‘హైనెకెన్ బిజినెస్ సర్వీసెస్ ఇండియా’ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ప్రారంభించారు. సుమారు 76,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ ఆధునిక కేంద్రం, కంపెనీకి గ్లోబల్ స్థాయిలో వ్యూహాత్మక హబ్‌గా పనిచేయనుంది.
ఈ జీసీసీ ద్వారా ఫైనాన్స్, డిజిటల్ టెక్నాలజీ, ఐటీ సేవలు, డేటా అనలిటిక్స్ వంటి కీలక విభాగాలకు సేవలు అందించబడతాయి. ఈ కేంద్రం ప్రారంభం ద్వారా హైదరాబాద్ నగరం గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లకు ప్రధాన కేంద్రంగా మరింత బలోపేతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.ప్రారంభ దశలోనే ఈ కేంద్రం ద్వారా 300కి పైగా నైపుణ్యంతో కూడిన ఉద్యోగ అవకాశాలు సృష్టించబడనున్నాయి. రాబోయే కొద్ది ఏళ్లలో ఈ ఉద్యోగాల సంఖ్యను 1,600 వరకు పెంచే లక్ష్యంతో సంస్థ ముందుకు సాగుతోంది. ఇది స్థానిక యువతకు మంచి అవకాశాలను అందించడమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కూడా తోడ్పడనుంది.
150 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన హైనెకెన్ ప్రపంచంలోని ప్రముఖ బ్రూయింగ్ సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ సంస్థ ఉత్పత్తులు 190కి పైగా దేశాల్లో అందుబాటులో ఉండగా, 70కి పైగా దేశాల్లో 165కు పైగా బ్రూవరీలను నిర్వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా తన వ్యాపారాన్ని విస్తరించింది. ఈ కొత్త జీసీసీ స్థాపనతో హైదరాబాద్ అంతర్జాతీయ వ్యాపార మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ ప్రారంభోత్సవంతో అంతర్జాతీయ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు (జీసీసీ) కేరాఫ్ అడ్రస్‌గా హైదరాబాద్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ప్రపంచస్థాయి దిగ్గజ సంస్థలు తమ వ్యూహాత్మక కేంద్రాల కోసం హైదరాబాద్‌ను ఎంచుకోవడం గర్వకారణమని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
