
ఇందిరమ్మ మహిళా శక్తి చీర ధరించిన మంత్రి సీతక్క!
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరిగిన మహిళా శక్తి సభ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఆకర్షణీయమైన రామచిలుక పచ్చ రంగు ‘ఇందిరమ్మ మహిళా శక్తి’ చీరను ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ఏడాది తెలంగాణవ్యాప్తంగా ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వం ఈ చీరలను పంపిణీ చేస్తోంది.
ఈ ప్రత్యేకమైన చీర.. మహిళా సాధికారత, స్వయం సమృద్ధి, సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ఇంజన్లుగా పనిచేస్తున్న స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న పట్టుదలకు నిదర్శనంగా నిలిచిందని సీతక్క అన్నారు. మహిళలకు మరింత శక్తిని అందించడం, పొదుపు సంఘాలను మరింత పటిష్టం చేయడం, సమాజంలో వారు సొంత కాళ్లపై నిలబడేలా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.
