
మంత్రి సీతక్కకు ‘ఉత్తమ సేవా పురస్కారం’
ప్రజా జీవితంలో విశేష సేవలు అందిస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)కు ప్రతిష్టాత్మకమైన ‘ఉత్తమ సేవా పురస్కారం’ లభించింది. శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో జరిగిన వేడుకలో, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు. విద్యార్థులు, ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమం, చిన్నారుల అభివృద్ధి కోసం సీతక్క చేస్తున్న కృషిని గుర్తించి ఈ పురస్కారాన్ని అందజేశారు. వెంకయ్య నాయుడు వంటి అనుభవజ్ఞుడైన నాయకుని నుంచి ఈ పురస్కారం అందుకోవడం తనకెంతో గర్వకారణమని, ఆయన మార్గదర్శనం దేశానికి ఎంతో విలువైనదని ఈ సందర్భంగా సీతక్క పేర్కొన్నారు.
ఈ వేదికపై మంత్రి సీతక్క తన జీవిత ప్రయాణాన్ని విద్యార్థులతో పంచుకుంటూ స్ఫూర్తిని నింపారు. పదో తరగతి తర్వాత చదువు మధ్యలో ఆగిపోయినప్పటికీ, పట్టుదలతో మళ్ళీ పుస్తకాలు పట్టి ఎల్ఎల్.బీ, ఎల్ఎల్.ఎం, పిహెచ్‌డీ పూర్తి చేసినట్లు ఆమె వివరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన కృషి ద్వారానే విజయం సాధ్యమవుతుందని అన్నారు. జీవితంలో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధన కోసం కష్టపడాలని సూచించారు. విద్యార్థి దశలో చేసిన శ్రమ జీవితాంతం గౌరవప్రదమైన జీవనానికి దోహదం చేస్తుందని, విద్య అనేది ఎవరూ తీసుకోలేని శాశ్వత ఆస్తి అని వివరించారు.
నిరుపేద విద్యార్థులకు ‘రామానుజన్ ఫౌండేషన్’ భరోసా
సేవను మించిన భగవదారాధన లేదని, సమాజ హితం కోసం పాటుపడే సంస్థలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. గత 24 ఏళ్లుగా రామానుజన్ ఫౌండేషన్ సాగిస్తున్న విద్యా, సామాజిక సేవలను ఆయన కొనియాడారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లోని నిరుపేద విద్యార్థులకు ఒలింపియాడ్ పరీక్షలు నిర్వహిస్తూ, వారిలో పోటీతత్వాన్ని పెంచడం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులను గుర్తించి, వారికి సరైన మార్గదర్శకత్వం అందించడం ద్వారా భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం చేస్తున్న ఫౌండేషన్ ప్రెసిడెంట్ తుమ్మ అమరేష్ బృందాన్ని ఆయన అభినందించారు. యువత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని, పెద్దల పట్ల గౌరవాన్ని, సమాజం పట్ల బాధ్యతను పెంపొందించుకోవాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న వారికి పురస్కారాలు ప్రదానం చేయడం సంతోషకరమని ఆయన అన్నారు. మంత్రి సీతక్క, ఎన్‌ఐటీ డైరెక్టర్ రమణారావు, రక్తదానం కోసం యాప్ అందిస్తున్న డాక్టర్ యలమంచిలి జగదీష్ బాబు, చెస్‌లో ప్రతిభ కనబరుస్తున్న శ్రేయాన్ష్ మురళీకృష్ణ, సామాజిక కార్యకర్త అన్నం శ్రీనివాస్, ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ వెంకట నారాయణలను అభినందించారు.
ములుగు జిల్లా ఘనత
పదో తరగతి ఫలితాల్లో ములుగు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల క్రమశిక్షణ, మాజీ కలెక్టర్ దివాకర్ నేతృత్వంలోని జిల్లా యంత్రాంగం సమన్వయం వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆమె ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ప్రముఖ జర్నలిస్ట్ వెంకట్ నారాయణ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజా సేవలో ఉంటూనే ఉన్నత చదువులు అభ్యసించిన సీతక్క ప్రస్థానం నేటి యువతకు ఆదర్శమని పలువురు వక్తలు కొనియాడారు.
