Let's talk: editor@tmv.in
యువ సెయిలర్ రమేజా భానును అభినందించిన మంత్రి సీతక్క

యువ సెయిలర్ రమేజా భానును అభినందించిన మంత్రి సీతక్క

Gaddamidi Naveen
27 మే, 2026

అంతర్జాతీయ స్థాయిలో సెయిలింగ్ క్రీడలో రాణిస్తూ.. "రెయిన్ బో హెమ్స్"లో విద్యను అభ్యసిస్తున్న తెలంగాణ యువ సెయిలర్ రమేజా భానును రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.

గతంలో ఒమన్, సింగపూర్‌లలో నిర్వహించిన అంతర్జాతీయ సెయిలింగ్ పోటీల్లో రమేజా భాను భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి, పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై విశిష్ట ప్రతిభ కనబరిచారు. వచ్చే వారం మొరాకోలో జరగనున్న అంతర్జాతీయ సెయిలింగ్ పోటీల్లో ఆమె మరోసారి భారతదేశం తరఫున బరిలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో రమేజా భాను సచివాలయంలో మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. తెలంగాణ యువత అంతర్జాతీయ వేదికలపై దేశ కీర్తిపతాకాన్ని ఎగురవేయడం రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని కొనియాడారు. రమేజా భాను వంటి ప్రతిభావంతులైన యువ క్రీడాకారిణులకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ సంపూర్ణ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మొరాకోలో జరగబోయే ప్రతిష్టాత్మక పోటీల్లో రమేజా భాను అద్భుత విజయంతో తిరిగి రావాలని మంత్రి ఆకాంక్షిస్తూ, ఆమెకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు.