
గ్రామ పంచాయతీలకు ప్రత్యేక వెసులుబాట్లు కల్పించాలి: కేంద్రానికి మంత్రి సీతక్క విజ్ఞప్తి
16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల సిఫార్సులపై కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్) ఆధ్వర్యంలో ఢిల్లీలో జాతీయ వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ (సీతక్క) పాల్గొని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కీలకమైన అభిప్రాయాలను, ప్రతిపాదనలను కేంద్రం ముందుంచారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆర్థిక సంఘం ప్రతిపాదించిన పనితీరు ఆధారిత గ్రాంట్లు, సొంత ఆదాయ వనరుల నిబంధనల్లో ఆదివాసి, గిరిజన, వెనుకబడిన గ్రామ పంచాయతీలకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలని మంత్రి కోరారు. గ్రామ పంచాయతీల పనితీరును కేవలం పన్నుల వసూళ్లతోనే కొలవకుండా.. ప్రజలకు అందిస్తున్న సేవలు, పారిశుధ్యం, పారదర్శకత, డిజిటల్ పాలన, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
జీపీలకు పనితీరు ఆధారిత గ్రాంట్లను తెలంగాణ ప్రభుత్వం స్వాగతిస్తోందని.. అయితే ఆదాయ సామర్థ్యం తక్కువగా ఉన్న మారుమూల ప్రాంతాల ప్రజలపై అదనపు పన్నుల భారం మోపేలా నిబంధనలు ఉండకూడదని స్పష్టం చేశారు. అభివృద్ధిని ప్రజల ఆర్థిక స్థితితో ముడిపెట్టడం సమంజసం కాదు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో జనాభా తక్కువగా ఉండటం వల్ల సొంత ఆదాయ వనరులు పరిమితంగా ఉంటాయి. కాబట్టి ఎస్సీ, ఎస్టీ జనాభా అధికంగా ఉన్న పంచాయతీలు, మండలాలకు ప్రత్యేక సడలింపులు ఇవ్వాలని మంత్రి కోరారు.
న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్‌లో ఉండటం వల్ల ఎన్నికలు జరగని 62 గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి నిధులు నిలిపివేయడం వల్ల అక్కడి ప్రజలకు అన్యాయం జరుగుతోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో నిధులు కొనసాగించేలా నిబంధనలు మార్చాలన్నారు. అలాగే స్థానిక అవసరాలకు అనుగుణంగా గ్రామ సభలు నిర్ణయాలు తీసుకునేలా ‘అన్‌టైడ్ బేసిక్ గ్రాంట్లను’ తగిన స్థాయిలో కొనసాగించాలని కోరారు.
డిజిటల్ గవర్నెన్స్, ఈ-గ్రామ్ స్వరాజ్, పీఎఫ్‌ఎంఎస్ వంటి వ్యవస్థలను స్వాగతిస్తూనే.. మారుమూల గ్రామాల్లో వీటికి అవసరమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ, సాంకేతిక మౌలిక వసతులు, సిబ్బంది శిక్షణను కేంద్రమే బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ సీఎస్ దానకిశోర్ తో పాటు ఇతర రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
