
పెనుకొండలో ఇష్టానుసారంగా మట్టి తవ్వకాల్ని చేపడుతున్న మంత్రి సవిత అనుచరులు: ఉషశ్రీ
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని పరిగి మండలంలో అక్రమ మట్టి తవ్వకాలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. పరిగి మేజర్ పంచాయతీ పరిధిలోని పెద్ద చెరువులో నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారంటూ మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆమె పార్టీ నాయకులు, స్థానిక కార్యకర్తలతో కలిసి పెద్ద చెరువును స్వయంగా పరిశీలించారు. అక్కడ క్షేత్రస్థాయిలో జరుగుతున్న తవ్వకాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ పెనుకొండ నియోజకవర్గంలో మంత్రి సవిత అనుచరులు అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారని ఆరోపించారు. పరిగి పెద్ద చెరువులో కేవలం తెలుగుదేశం పార్టీకి చెందిన రైతులకు మాత్రమే మట్టి తోలుకునేలా అనుమతులు ఇస్తూ పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఇతర పార్టీలకు చెందిన రైతులు ఎవరైనా మట్టి కోసం చెరువు వద్దకు వెళ్తే వారిపై అక్రమ కేసులు బనాయిస్తామని అధికారులు బెదిరింపులకు దిగడం దుర్మార్గమన్నారు.
అయితే అధికార పార్టీ నేతల అక్రమాలపై స్థానిక రైతులు, గ్రామస్తులు ఆధారాలతో సహా ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేవలం అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారుతున్న అధికారులకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. పెనుకొండ నియోజకవర్గంలో సాగుతున్న ఈ అవినీతి భాగోతంపై మంత్రి సవితతో పాటు ఆమెకు సహకరిస్తున్న అధికారులపై తక్షణమే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పెద్ద చెరువులో జరుగుతున్న అక్రమ తవ్వకాలను అధికారులు తక్షణమే నిలిపివేసి చర్యలు చేపట్టకపోతే, బాధిత రైతులు, గ్రామ ప్రజలను కలుపుకొని శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఉషశ్రీ చరణ్ హెచ్చరించారు. అక్రమాలను అడ్డుకునే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పరిగి గ్రామానికి చెందిన రైతులు, వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
