Let's talk: editor@tmv.in
ధాన్యం కొనుగోళ్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ టెలీకాన్ఫరెన్స్‌

ధాన్యం కొనుగోళ్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ టెలీకాన్ఫరెన్స్‌

Gaddamidi Naveen
12 మే, 2026

హుస్నాబాద్ నియోజకవర్గంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో కీలకమైన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలు, సివిల్ సప్లై అధికారులు, వ్యవసాయ అధికారులతో కలిసి కొనుగోలు ప్రక్రియను సమీక్షించారు.

కొనుగోలు కేంద్రాలకు ధాన్యం భారీగా వస్తున్న నేపథ్యంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియ వేగంగా జరగాలి. రైతులు ఇబ్బంది పడేలా అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు అని ఆయన హెచ్చరించారు. గన్ని బ్యాగుల కొరత రాకుండా చూడాలని, సాయంత్రం వేళల్లో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని మంత్రి సూచించారు.

ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి కోరారు. ధాన్యం తరలింపులో వాహనాల కొరత రాకుండా ప్రతి జిల్లాకు ఒక ఎంవీఐ అధికారిని కంట్రోల్ రూమ్ ద్వారా ఏర్పాటు చేయాలని డీటీసీలను ఆదేశించారు. హామలీల కొరత ఉండకూడదని, మిల్లుల వద్ద ఎక్కడా సమస్య తలెత్తకూడదని స్పష్టం చేశారు. హుస్నాబాద్ యార్డులో ధాన్యం రద్దీ ఎక్కువగా ఉన్నందున, ఇప్పటికే ఉన్న ఐదు బృందాలకు అదనంగా మరిన్ని కాంటా బృందాలను ఏర్పాటు చేయాలని మంత్రి తెలిపారు.

ధాన్యం అధికంగా వచ్చే అక్కన్నపేట, హుస్నాబాద్ టౌన్, శనిగరం, కోహెడ, బస్వాపూర్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులను కోరారు. శనిగరంలో లారీలతో పాటు అవసరమైతే ట్రాక్టర్లను ఉపయోగించి ధాన్యాన్ని వేగంగా తరలించాలని ఆదేశించారు. ఇకపై ప్రతి రెండు రోజులకు ఒకసారి టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తానని మంత్రి వెల్లడించారు.