Let's talk: editor@tmv.in
తీవ్ర పదజాలంతో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను దూషించిన మంత్రి పొన్నం ప్రభాకర్
తీవ్ర పదజాలంతో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను దూషించిన మంత్రి పొన్నం ప్రభాకర్

తీవ్ర పదజాలంతో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను దూషించిన మంత్రి పొన్నం ప్రభాకర్

Dantu Vijaya Lakshmi Prasanna
2 జూన్, 2026

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో జనసేన పార్టీ అద్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి నిర్వహించనున్న నవ నిర్మాణ సభపై తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రిపొన్నం ప్రభాకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

సోమవారం మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ అస్తిత్వాన్ని, ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొదట తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని, ఆ తర్వాతే ఇక్కడ 'నవ నిర్మాణ సభ' నిర్వహించుకోవాలని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి తెలంగాణ బిడ్డ ఈ రోజును ఒక పండగలా జరుపుకోవడానికి సిద్ధమవుతుంటే, సరిగ్గా ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో సభ పెట్టడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. గతంలో తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించి, ఇక్కడి ప్రజల భావోద్వేగాలను గాయపరిచిన వ్యక్తికి ఈ గడ్డపై సభలు పెట్టే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. ఏపీ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వదిలేసి, తెలంగాణలో విద్వేషాలు రగల్చడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

బీజేపీ ఎజెండాతోనే పవన్ కళ్యాణ్ దొడ్డిదారి రాజకీయం

తెలంగాణలో ప్రస్తుతం ప్రజాస్వామ్యయుతంగా ప్రజా ప్రభుత్వం నడుస్తోందని, ఇక్కడ శాంతిభద్రతలను క్షీణింపజేసేందుకు బీజేపీ పవన్ కళ్యాణ్‌ను ఒక ఏజెంట్‌గా వాడుకుంటోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీ లేదని, ఇక్కడ ఆ పార్టీ పప్పులు ఉడకకనే పవన్ కళ్యాణ్‌ను దొడ్డిదారిన ముందుకు నెడుతోందని విమర్శించారు. "బీజేపీ డైరెక్షన్‌లో తెలంగాణలో ప్రాంతీయ వైషమ్యాలు, విద్వేషాలు రెచ్చగొట్టడమే లక్ష్యంగా పవన్ ఈ నటన మొదలుపెట్టారని మంత్రి పేర్కొన్నారు. ఒకవేళ ఇది నిజం కాకపోతే, కేవలం బీజేపీ ఇచ్చే పారితోషికం కోసమే ఇక్కడికి రాలేదని కొండగట్టు అంజన్న సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాలి" అంటూ పవన్ కళ్యాణ్‌కు సవాల్ విసిరారు. కేవలం తన రాజకీయ బాస్ నరేంద్ర మోడీని మెప్పించడానికే పవన్ ఈ సభను నిర్వహిస్తున్నారని దుయ్యబట్టారు.

గత వ్యాఖ్యల ప్రస్తావన: కొబ్బరి చెట్ల వ్యాఖ్యలు, అన్నం మానేసిన ఉదంతం

తెలంగాణ ఉద్యమ సమయంలో, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. "తెలంగాణ ప్రజల చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని నాడు విషం కక్కిన వ్యక్తి పవన్ కళ్యాణ్. తెలంగాణ రక్తం ఉన్న ఏ బిడ్డ కూడా ఆయన సభకు వెళ్లరు" అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తాను 11 రోజులు అన్నం తినకుండా మానేశానని బహిరంగంగా ప్రకటించిన (వెధవ) పవన్, ఇప్పుడు ఇక్కడికి వచ్చి తెలంగాణ పట్ల మొసలి కన్నీరు కారిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కన్నతల్లికి గాజులు కొనలేని వాడు పినతల్లికి ఒడ్డాణం చేయిస్తానన్నట్లు... సొంత రాష్ట్రంలో కూట్ల రాయి తీయలేని వాడు, ఇక్కడికి వచ్చి ఎట్లా రాయి తీస్తాడంటూ ఘాటుగా సామెతలతో విమర్శించారు.

ఏపీలో చూపించాల్సింది ఇక్కడెందుకు?

ఆంధ్రప్రదేశ్ ప్రజలు పవన్ కళ్యాణ్‌ను నమ్మి భారీ మెజారిటీతో గెలిపించి ఉప ముఖ్యమంత్రిని చేశారని, ఆయనకు చేతనైతే ఆ నవ నిర్మాణాన్ని ఏపీలోనే చూపించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ హితవు పలికారు. "మీ నవ నిర్మాణ సభలను బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో లేదా కేరళ, తమిళనాడులలో ఎందుకు పెట్టడం లేదు? కేవలం తెలంగాణలోనే ఎందుకు పెడుతున్నారు?" అని నిలదీశారు. తెలంగాణలో నాలుగు రెచ్చగొట్టే మాటలు మాట్లాడి, ఇక్కడి జనాలు తన్నుకు చావాలనేదే పవనిజమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనువణువునా తెలంగాణ వ్యతిరేకతను నింపుకున్న పవన్ కళ్యాణ్, ఇక్కడి వాతావరణాన్ని కలుషితం చేయడానికి వస్తే తెలంగాణ వాదులు తీవ్రంగా ఆక్షేపిస్తారని హెచ్చరించారు.

తెలంగాణ అస్తిత్వ పోరాటం - అభిమానులకు సూచన

తాను 2014 లో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయం నుండి తెలంగాణ సాధన కోసం, సకల జనుల సమ్మె ద్వారా ఎంతో మందితో కలిసి పోరాటం చేశానని పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. అమరవీరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటామని అన్నారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం కూడా అమరవీరుల కుటుంబాలను, పోరాట యోధులను గుర్తించేందుకు కమిటీ వేసి గౌరవిస్తోందని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో తమకు ఎప్పుడూ మంచి సంబంధాలే ఉంటాయని, భారతీయులుగా అన్ని రాష్ట్రాలను గౌరవిస్తామని చెప్తూనే, అవమానాలను సహించబోమని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన సినిమాలు చూసుకోవచ్చని, కానీ సినిమా నటుడనే ముసుగులో తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తే ఎవరూ ఊరుకోరని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పిన తర్వాతే పవన్ తన తదుపరి చర్యల గురించి ఆలోచించాలని డిమాండ్ చేశారు.