
ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమైన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న సుమారు 29 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. విద్యార్థుల్లో ఆకలిని నివారించడం, పోషకాహార లోపాన్ని తగ్గించడం, పాఠశాల హాజరును పెంచడం, డ్రాప్‌అవుట్‌లను తగ్గించడం, విద్యార్థుల ఏకాగ్రత, విద్యా ప్రతిభను మెరుగుపరచడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలన్నారు. బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలుకు ప్రభుత్వం వార్షికంగా రూ.540 కోట్లు, పాలు సరఫరాకు రూ.180 కోట్లు కేటాయించగా, మొత్తం రూ.720 కోట్ల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా “బడిబాట” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. మధ్యలో చదువు మానేసిన విద్యార్థులను తిరిగి బడుల్లో చేర్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ జిల్లాలోని 672 ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 93,501 మంది విద్యార్థులు చదువుతుండగా, తొలి దశలో ఎంపిక చేసిన 45 పాఠశాలల్లో 12,437 మంది విద్యార్థులకు మన్నా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, యశస్వినీ రెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా, జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య, మన్నా ట్రస్ట్ సీఈవో లీనా జోసెఫ్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
