

కూకట్‌పల్లి డిపోలో 60 ఈవీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాను మరింత పర్యావరణహితంగా మార్చే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఎస్‌ఆర్‌టిసి) ఒక కీలక అడుగు వేసింది. కూకట్‌పల్లి బస్ డిపోలో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జ్యోతి ప్రజ్వలన చేసి, జెండా ఊపి 60 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, 'గ్రీన్ ఛాలెంజ్'లో భాగంగా ప్రజలకు కాలుష్య రహిత పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని ప్రకటించారు. హైదరాబాద్ నగరం మరో ఢిల్లీలా కాలుష్య కాసారంగా మారకుండా ఉండేందుకే ఈవీ వాహనాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం ప్రజా రవాణా పై తీవ్రంగా ఉందని ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సులు భవిష్యత్తుకు ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో ఈవీ బస్సుల విస్తరణపై మంత్రి కీలక గణాంకాలను వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నడుస్తున్న 10 వేల బస్సులలో వెయ్యికి పైగా ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయని అందులో హైదరాబాద్ నగరంలోనే 545 ఈవీ బస్సులు సేవలందిస్తున్నాయని తెలిపారు. అదేవిదంగా ఇంటర్‌సిటీ సేవల కింద 580 బస్సులు నడుస్తున్నాయన్నారు. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా మరో 2,200 ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్రంలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. తద్వారా మొత్తం ఈవీ బస్సుల సంఖ్య 3,000కు చేరుకుంటుందని పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధిస్తే సుమారు 600 టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించే అవకాశం ఉంటుందని, 2027 నాటికి మరిన్ని ఈవీ బస్సులను తీసుకురావడమే ప్రభుత్వ సంకల్పమని మంత్రి పేర్కొన్నారు.
కార్మికుల సంక్షేమం, సంస్థ సంస్కరణలు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీలో పలు విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కొత్త నియామకాలు, కొత్త బస్సుల ప్రవేశంతో టిజిఎస్‌ఆర్‌టిసి దేశంలోనే ఉత్తమ సంస్థగా నిలుస్తోందని హర్షం వ్యక్తం చేశారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ ప్రతి నెల రెండో మంగళవారం డీఎంలు, ఆర్‌ఎంలు, ఇతర ఉన్నతాధికారులు కార్మికులతో సమావేశమై వారి సమస్యలపై చర్చిస్తున్నారని చెప్పారు. త్వరలోనే ఆర్టీసీ సంఘాల గుర్తింపు ఎన్నికలు నిర్వహించి అనంతరం సంఘాల ప్రతినిధులతో చర్చించి పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జంట నగరాల్లో రోజుకు సుమారు 35 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగిస్తున్నారని, సంస్థ అభివృద్ధి కోసం కార్మికులు మరింత కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.
మహాలక్ష్మి పథకం విజయం.. కేపీహెచ్‌బీలో కొత్త డిపో
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మహాలక్ష్మి' ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా మహిళలు ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 310 కోట్ల జీరో టికెట్లను వినియోగించుకున్నారని మంత్రి వెల్లడించారు. మహిళలకు కేవలం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాకుండా భవిష్యత్తులో వారిని బస్సుల యజమానులుగా కూడా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇక స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి కేపీహెచ్‌బీలో కొత్త బస్ డిపోను ఏర్పాటు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కూకట్‌పల్లి డిపో విస్తరణలో భాగంగా ఐదు ఎకరాల స్థలంలో కొత్త డిపో నిర్మాణానికి హౌసింగ్ బోర్డు అధికారులకు లేఖ రాయాలని జిల్లా కలెక్టర్, ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో కొత్త కాలనీలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, అందుకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని రాబోయే రోజుల్లో కూకట్‌పల్లి ప్రాంతాన్ని పూర్తిగా కాలుష్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు.
