
ఎల్కతుర్తి అభివృద్ధికి రూ.13 కోట్ల రోడ్డు పనులకు మంత్రి పొన్నం శంకుస్థాపన
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధిస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం ఎల్కతుర్తి జంక్షన్ వద్ద మడిపల్లి నుంచి ఎల్కతుర్తి జంక్షన్ వరకు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూ.13 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 3.5 కిలోమీటర్ల బీటీ రహదారి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రహదారి నిర్మాణం పూర్తయితే గ్రామాలకు మండల కేంద్రంతో అనుసంధానం మరింత మెరుగుపడుతుందని తెలిపారు. దీంతో ప్రజల రాకపోకలు సులభతరం కావడంతో పాటు అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలో కోర్టు, విద్యుత్ ఉపకేంద్రం, తహసీల్దార్ కార్యాలయం వంటి ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటవుతున్నాయని, ఇవి మండల అభివృద్ధికి దోహదపడతాయని అన్నారు.
ఈ రహదారి నిర్మాణ అవసరాన్ని కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తన దృష్టికి తీసుకువచ్చారని మంత్రి తెలిపారు. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు చేసిన విజ్ఞప్తి మేరకే ఈ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. రహదారి నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచిస్తూ, పనుల అమలులో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమన్వయంతో సహకరించాలని కోరారు.
కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ఈ రహదారి నిర్మాణంతో గ్రామాల మధ్య కనెక్టివిటీ పెరిగి, ప్రాంతీయ అభివృద్ధికి ఊతమిస్తుందని అన్నారు. తర్వాత ఎల్కతుర్తి–దామెర ప్రధాన రహదారిని మంత్రి అధికారులతో కలిసి పరిశీలించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
