
ఖమ్మంలో ‘రైతు ఆశీర్వాద సభ’ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పొంగులేటి
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సాహసోపేత నిర్ణయాలతో అన్నదాతలకు కొండంత అండగా నిలుస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో ఈ నెల 30న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న ‘రైతు ఆశీర్వాద సభ’ ఏర్పాట్లను ఆదివారం ఆయన ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్ష సూచనలు ఉన్నందున వాతావరణ మార్పులను తట్టుకునేలా జర్మన్ హ్యాంగర్లతో వసతులు కల్పించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సైతం మానవీయ కోణంలో కొనుగోలు చేసి, వారం రోజుల లోపలే రైతుల అకౌంట్లలో పైసలు వేసిన నిఖార్సైన రైతు పక్షపాత ప్రభుత్వం ఇది అని కొనియాడారు. ఖమ్మం పట్టణంలో గతంలో వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు, అన్నదాతలకు నడిరోడ్డుపై సంకెళ్లు వేసి జైలుకు పంపించిన దుర్మార్గాన్ని జిల్లా ప్రజలు మరువరు. నాడు రైతులను హింసించిన వాళ్లే.. ప్రజలు తమను తిరస్కరించారనే ఫ్రస్ట్రేషన్‌తో నేడు ముసలి కన్నీరు కారుస్తూ కపట ప్రేమ ఒలకబోస్తున్నారని పొంగులేటి పేర్కొన్నారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేస్తామని తెలిపారు. ఈ ప్రభుత్వం పేద ప్రజలందరికీ అండగా ఉండే ఇందిరమ్మ రాజ్యమని, తమ హయాంలో సాధించిన ప్రగతిని వివరించారు. కేవలం రెండున్నరేళ్ల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 72,000 ఉద్యోగాలు ఇచ్చామని, త్వరలోనే మరిన్ని వేలాది నోటిఫికేషన్లు ఇస్తామని. ఒక్క రూపాయి లంచం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నిధులు జమ చేస్తున్నామని నేతలు తెలిపారు. రూరల్ ప్రాంతాలకు 2.5 లక్షలు, అర్బన్ ప్రాంతాలకు లక్ష ఇళ్లను మంజూరు చేశామని పేర్కొన్నారు.
అసంపూర్తిగా ఉన్న కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తాం. రహదారుల అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు రూ. 22,000 కోట్లను మంజూరు చేశామని మంత్రి వెల్లడించారు. ఈ పరిశీలనలో జిల్లా ఎమ్మెల్యేలు, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, సీపీ సునీల్ దత్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
