
వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష
వెలిగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి 2026 సీజన్ ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ మేరకు డోర్నాల వద్ద ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి మంగళవారం క్షేత్రస్థాయిలో సుమారు మూడు గంటల పాటు అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులతో సుధీర్ఘ సమీక్ష నిర్వహించారు.
ప్రాజెక్టు పనులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో, నిర్దేశిత గడువులోగా పనులు పూర్తిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా టన్నెల్స్‌లో లైనింగ్ పనులు నెమ్మదిగా సాగుతున్న అంశంపై అధికారులు, ఏజెన్సీలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పెట్రోలు, డీజిల్ కొరత, టన్నెల్స్‌లో కార్మికుల కొరత, యంత్రాల కొరత వంటి సమస్యలను అధిగమించి లక్ష్యానికి అనుగుణంగా పనులను వేగవంతం చేయాలని ఏజెన్సీ ప్రతినిధులను మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం ఐదు గ్యాంట్రీలతో కొనసాగుతున్న లైనింగ్ పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి టన్నెల్స్‌లోకి వెళ్లి రాత్రివేళల్లోనూ పనుల పురోగతిని పరిశీలించారు. టన్నెల్-2లో 12వ కిలోమీటర్ వద్ద నిలిచిపోయిన టిబిఎం యంత్రాన్ని తొలగించేందుకు హైకోర్టు అనుమతి లభించినట్లు తెలిపారు. టన్నెల్స్ ద్వారా 54 టీఎంసీల నీటిని తరలించాలంటే ఆ యంత్రాన్ని తొలగించడం అత్యవసరమని పేర్కొన్నారు. ఈ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
ఇక ప్రాజెక్టు ప్రభావిత నిర్వాసిత కుటుంబాలకు సంబంధించి పునరావాస (ఆర్ అండ్ ఆర్) బిల్లుల చెల్లింపులు త్వరలో ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు.ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తైందని ప్రకటించి ప్రకాశం జిల్లా రైతులను మోసం చేశారని ఆరోపించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి కృషి చేస్తుండగా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విధానాలను ఆయన విమర్శించారు.
