

పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు
పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోపు గోదావరి వృథా జలాలను కృష్ణా డెల్టాకు తరలించాలన్న చంద్రబాబు నాయుడి ముందుచూపునకు పట్టిసీమ ఎత్తిపోతల పథకమే నిదర్శనమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుధవారం ఉదయం ఆయన ఏలూరు జిల్లాలో పట్టిసీమ, తూర్పుగోదావరి జిల్లాలో తాడిపూడి ఎత్తిపోతల పథకాల మోటార్లను ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా పట్టిసీమ డెలివరీ పాయింట్, తాడిపూడి ప్రాజెక్టుల వద్ద గోదావరి మాతకు ఆయన జలహారతి ఇచ్చారు.
మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, కేవలం రూ. 1,300 కోట్ల వ్యయంతో నిర్మించిన పట్టిసీమ ద్వారా ఇప్పటివరకు 442 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలించి, రూ. 50 వేల కోట్ల విలువైన పంటల ఆదాయాన్ని సృష్టించామని మంత్రి వెల్లడించారు. నాడు పట్టిసీమను ‘ఒట్టిసీమ’ అని అవహేళన చేసిన జగన్, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఆల్మట్టి, శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి కృష్ణా జలాశయాలు ఖాళీగా ఉన్న ప్రస్తుత తరుణంలో, ఎగువ నుంచి వస్తున్న గోదావరి జలాలను ఒడిసిపట్టి కృష్ణా డెల్టాకు ఊపిరి పోస్తున్నామన్నారు. ప్రస్తుతం వస్తున్న ఇన్ఫ్లోల నుంచి ప్రతిరోజూ 8,000 క్యూసెక్కుల నీటిని పట్టిసీమ ద్వారా పంపుతామని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న ‘సూపర్ ఎల్ నినో’ ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు కూటమి ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉందన్నారు. చంద్రబాబు సూచనలతో చేపట్టిన ‘జలధార-జలహారతి’ 100 రోజుల కార్యక్రమం ఇప్పటికే 98 రోజులు పూర్తి చేసుకుందని వివరించారు. భూమినే జలాశయంగా మార్చి భూగర్భ జలాలను పెంచడమే దీని లక్ష్యమన్నారు. భూగర్భ జలమట్టం ఒక మీటరు పెరిగితే 99 టీఎంసీల నీరు లభ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారని పేర్కొన్నారు. సమర్థ నీటి యాజమాన్యం వల్లే నేడు పులిచింతలలో 28 టీఎంసీల నీటిని ఉంచుకోగలిగామన్నారు. గత 70 ఏళ్లలో జూలై 5 నాటికి గోదావరిలో ఇన్‌ఫ్లోలు లేకపోవడం ఇదే తొలిసారని నిపుణులు చెబుతున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మొదట తాగునీటికి, ఆ తర్వాతే సాగునీటికి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఎల్ నినో ప్రభావాన్ని తట్టుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు రైతు సోదరులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నీటి పొదుపును పాటిస్తూ, అవకాశం ఉన్న చోటల్లా ఆరుతడి పంటలను సాగు చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు.
