
గోదావరి పుష్కరాలపై మంత్రి నారాయణ సమీక్ష
రానున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు’ ఉన్నతాధికారులతో మంత్రి నారాయణ సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌తో పాటు సీనియర్ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ముప్పిడి వెంకటేశ్వర రావు, బత్తుల బాల రామకృష్ణ, జ్యోతుల జోగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు, మండపేట మున్సిపల్ కమిషనర్లు ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. పుష్కర ఘాట్ల నిర్మాణం, రోడ్ల మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి అవసరమయ్యే నిధుల అంచనాలను మంత్రుల ముందు ఉంచారు. ముఖ్యంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యత క్రమంలో పనులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
భక్తుల సౌకర్యాలే పరమావధి
సమీక్ష అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ పుష్కరాలకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ సంపత్ కుమార్, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్‌లకు పనుల పర్యవేక్షణపై కీలక సూచనలు చేశారు. నిధుల కేటాయింపులో జాప్యం లేకుండా చూస్తామని, నిర్ణీత కాల వ్యవధిలో పనులు పూర్తి కావాలని మంత్రి స్పష్టం చేశారు.
