Let's talk: editor@tmv.in
రష్యా గిరెడ్‌మెట్‌ సంస్థకు మంత్రి లోకేష్ ఆహ్వానం.. నెల్లూరులో తయారీ యూనిట్ల ఏర్పాటుపై చర్చలు
రష్యా గిరెడ్‌మెట్‌ సంస్థకు మంత్రి లోకేష్ ఆహ్వానం.. నెల్లూరులో తయారీ యూనిట్ల ఏర్పాటుపై చర్చలు
రష్యా గిరెడ్‌మెట్‌ సంస్థకు మంత్రి లోకేష్ ఆహ్వానం.. నెల్లూరులో తయారీ యూనిట్ల ఏర్పాటుపై చర్చలు

రష్యా గిరెడ్‌మెట్‌ సంస్థకు మంత్రి లోకేష్ ఆహ్వానం.. నెల్లూరులో తయారీ యూనిట్ల ఏర్పాటుపై చర్చలు

Gaddamidi Naveen
8 జూన్, 2026

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో తయారీ యూనిట్ల స్థాపన సదుపాయాల ఏర్పాటును పరిశీలించాల్సిందిగా రష్యాకు చెందిన ప్రముఖ ‘గిరెడ్‌మెట్ ఇన్‌స్టిట్యూట్’ కు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆదివారం ఆహ్వానించారు. మాస్కోకు చెందిన ఈ పరిశోధనా సంస్థ ప్రతినిధులతో జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడారు. గిరెడ్‌మెట్ వంటి అంతర్జాతీయ సంస్థలతో కుదుర్చుకునే సాంకేతిక భాగస్వామ్యాలు భారతదేశానికి, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌కు అపారమైన అవకాశాలను సృష్టిస్తాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఆదివారం విడుదలైన ఒక అధికారిక ప్రకటన ప్రకారం.. ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్న విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాలలో 'డీప్ ప్రాసెసింగ్ అండ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్ రిఫైనింగ్ హబ్' ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని గిరెడ్‌మెట్ ఇన్‌స్టిట్యూట్‌ను మంత్రి లోకేష్ కోరారు. దీనితో పాటు నెల్లూరు జిల్లాలో 'నియోడైమియం-ఐరన్-బోరాన్' అయస్కాంత తయారీ కేంద్రాన్ని నెలకొల్పడంలో భాగస్వామ్యం వహించాలని ఆయన ప్రతిపాదించారు.

భారతదేశంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ), పవన విద్యుత్ రంగాలకు అవసరమైన మద్దతును అందించేందుకు గాను.. గిరెడ్‌మెట్ సంస్థకు చెందిన అత్యాధునిక ప్రాసెసింగ్ టెక్నాలజీలను ఉపయోగించి ఒక ఫుల్-సైకిల్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. అలాగే ఇండియన్ టెక్ కారిడార్‌లో అందుబాటులో ఉన్న ప్లగ్-అండ్-ప్లే ల్యాబొరేటరీ మౌలిక సదుపాయాల సహాయంతో మెటలర్జీ, అల్ట్రా-ప్యూర్ సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ ల్యాబొరేటరీని స్థాపించడంలో సహకరించాలని కోరారు. పారిశ్రామిక వ్యర్థాలు, మైనింగ్ వ్యర్థాల నుంచి వ్యూహాత్మక అరుదైన లోహాలను తిరిగి వెలికితీసేందుకు తమతో చేతులు కలపాలని విజ్ఞప్తి చేశారు.

రష్యా ప్రభుత్వ అణుశక్తి సంస్థ 'రోసాటమ్' సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకోసిస్టమ్‌లో భాగమైన గిరెడ్‌మెట్ ఇన్‌స్టిట్యూట్ 1931లో మాస్కోలో స్థాపించబడింది. ఈ సంస్థ ప్రస్తుతం కీలక ఖనిజాలు, బ్యాటరీ రీసైక్లింగ్, అరుదైన ఖనిజాల ప్రాసెసింగ్ అధునాతన మెటీరియల్స్ అభివృద్ధి రంగాలలో భారతదేశంతో భాగస్వామ్య అవకాశాలను పరిశీలిస్తోంది.

అటామిక్ ఎనర్జీ మ్యూజియం సందర్శన

ఈ సమావేశానికి ముందు, మంత్రి నారా లోకేష్ మాస్కోలోని ప్రముఖ ‘అటామిక్ ఎనర్జీ మ్యూజియం’ను సందర్శించారు. ఇది రష్యాలోనే అతిపెద్ద అణుశక్తి మ్యూజియంలలో ఒకటి. ఏడు అంతస్తుల భవనంలో, 25,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ మ్యూజియం సోవియట్ అణు కార్యక్రమం యొక్క పరిణామక్రమాన్ని, ఆధునిక అణుశక్తి పరిణామాలను, భవిష్యత్తు శాస్త్రీయ అవకాశాలను అద్భుతంగా ప్రదర్శిస్తుంది. నవంబర్ 2023లో ప్రారంభించబడిన ఈ మ్యూజియంలో ఇంటరాక్టివ్ ప్రదర్శనలు, సైన్స్ లాబ్‌లు, గైడెడ్ టూర్‌లు ఉన్నాయి.

ఈ సందర్భంగా మ్యూజియం అధికారులు మంత్రి లోకేష్ కి వివరాలు అందిస్తూ.. ఇప్పటివరకు 80కి పైగా దేశాల నుంచి 35 లక్షల (3.5 మిలియన్) కంటే ఎక్కువ మంది సందర్శకులు ఈ కేంద్రాన్ని సందర్శించారని, ఇది ఒకేసారి 2,100 మంది సందర్శకులకు వసతి కల్పించగలదని వివరించారు. మాస్కో ప్రభుత్వం, రోసాటమ్ స్టేట్ కార్పొరేషన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ మ్యూజియం అణుశక్తి చరిత్రను, దాని శాంతియుత అనువర్తనాలను ప్రపంచానికి చాటిచెబుతోంది.