
పర్యావరణవేత్త దుశర్ల సత్యనారాయణను పరామర్శించిన మంత్రి కొండా సురేఖ
ప్రముఖ పర్యావరణవేత్త, జలసాధన సమితి వ్యవస్థాపకులు దుశర్ల సత్యనారాయణపై జరిగిన దాడిని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని మానవత్వంపై జరిగిన దాడిగా ఆమె అభివర్ణించారు. దాడిలో తీవ్రంగా గాయపడి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సత్యనారాయణను మంత్రి పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
సత్యనారాయణ గాయపడిన తీరును చూస్తుంటే ఒక ధ్వంసమైన అడవిలా కనిపిస్తోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం, నీటి హక్కుల కోసం జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తిపై ఇలాంటి దాడి జరగడం శోచనీయమన్నారు. నల్గొండ జిల్లాలోని ఫ్లోరోసిస్ సమస్యను జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన చేసిన పోరాటాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వద్ద బాధితులను ప్రవేశపెట్టి సమస్య తీవ్రతను వివరించిన వైనాన్ని ఆమె ప్రస్తావించారు.
ఈ దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నల్గొండ ఎస్పీ నరసింహను మంత్రి ఆదేశించారు. సత్యనారాయణ ప్రకృతి పట్ల ఉన్న మక్కువతో స్వయంగా 70 ఎకరాలలో దట్టమైన అడవిని పెంచి, జీవవైవిధ్యానికి నిలయంగా మార్చారని కొనియాడారు. ఈ అడవి సంరక్షణ కోసం 'వనమహోత్సవం' నిధుల నుంచి తగిన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
ప్రకృతి శక్తే ఆయనను ఈ ప్రమాదం నుంచి కాపాడిందని, సత్యనారాయణ త్వరగా కోలుకుని తిరిగి పర్యావరణ పనుల్లో నిమగ్నం కావాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రభుత్వ పరంగా ఆయనకు పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకుని, విశేష సందర్భాల్లో మొక్కలు నాటాలని, పర్యావరణ సమతుల్యతను కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
