Let's talk: editor@tmv.in
ఇబ్రహీంపట్నంలో రూ.338 కోట్ల ‘హామ్’ రోడ్డు ప్రాజెక్టులకు మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన

ఇబ్రహీంపట్నంలో రూ.338 కోట్ల ‘హామ్’ రోడ్డు ప్రాజెక్టులకు మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన

Gaddamidi Naveen
8 జులై, 2026

తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు, రోడ్డు నెట్‌వర్క్ ఆధునీకరణకు ప్రజా ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ‌ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నం మండలం తొర్రూరు గ్రామంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హామ్) కింద రూ. 338 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ప్రతిష్టాత్మక రోడ్డు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రజలు అందించిన ఘన స్వాగతానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాంత ప్రజలతో తనకు ఎన్నో ఏళ్ల అనుబంధం ఉందని, నియోజకవర్గ అభివృద్ధి అవసరాలపై తనకు పూర్తి అవగాహన ఉందని చెప్పారు. ప్రజల ఆశలు, అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద రహదారి అభివృద్ధి కార్యక్రమాల్లో ఒకటిగా హామ్ ప్రాజెక్టులను ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 34 ప్యాకేజీల కింద మొత్తం 6,092 కిలోమీటర్ల పొడవున 441 రహదారులను సుమారు రూ.13,000 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇటీవల నల్గొండలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారని గుర్తుచేశారు.

రోడ్ల నిర్మాణంలో నాణ్యత, భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి స్పష్టం చేశారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రహదారులు నిర్మించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మెరుగైన రహదారుల ద్వారా రవాణా సౌకర్యాలు పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు, ఆర్థిక కార్యకలాపాలు కూడా విస్తరిస్తాయని చెప్పారు. హైదరాబాద్ రూరల్ సర్కిల్-1, సర్కిల్-2 పరిధిలో దాదాపు 30 రహదారుల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. వాటిలో భాగంగా 149 కిలోమీటర్ల మేర 14 రహదారుల అభివృద్ధి పనులకు రూ.338 కోట్ల వ్యయంతో శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు.

ఈ దశలో హయత్‌నగర్–తొర్రూరు–కోహెడ–అనాజ్‌పూర్, అనాజ్‌పూర్–అబ్దుల్లాపూర్‌మెట్–బందరవిర్యాల్, హయత్‌నగర్–కుంట్లూర్–పసుమాముల–తారామతిపేట్, సాగర్ రోడ్–ఇంజాపూర్–తొర్రూరు–బ్రహ్మన్‌పల్లి–రాగన్నగూడ,

సాగర్ రోడ్–ఇంజాపూర్–హయత్‌నగర్ మార్గాల అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు తెలిపారు.

గమనాన్ని మార్చబోతున్న నాలుగు లేన్ల రహదారులు

ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, మేడ్చల్, ఎల్‌బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సెంట్రల్ లైటింగ్ (డివైడర్ లైటింగ్) సదుపాయంతో ఆధునిక నాలుగు లేన్ల రహదారుల నిర్మాణం ఒక చారిత్రాత్మక మైలురాయి అని మంత్రి అభివర్ణించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా తుర్కయాంజల్, తొర్రూరు, పెద్ద అంబర్‌పేట్, కుంట్లూర్, హయాత్‌నగర్ పరిసర ప్రాంతాలకు అద్భుతమైన కనెక్టివిటీ లభిస్తుందన్నారు.

ఈ నూతన రహదారుల వల్ల ట్రాఫిక్ రద్దీ తగ్గి, ప్రయాణ సమయం ఆదా అవ్వడమే కాకుండా రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని మంత్రి హామీ ఇచ్చారు. మెరుగైన రవాణా సౌకర్యాల వల్ల ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమై, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, గ్రామీణ-పట్టణ ప్రాంతాల అనుసంధానానికి ఈ ప్రాజెక్టులు దిక్సూచిగా మారుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, ఎంపీలు కిరణ్ కుమార్ చామల, ఈటల రాజేందర్, కె. విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు
IbrahimpatnamHAMProjectsRoadDevelopmentTelanganaInfrastructureFourLaneRoadsConnectivityHyderabadRevanthReddy
ఇబ్రహీంపట్నంలో రూ.338 కోట్ల ‘హామ్’ రోడ్డు ప్రాజెక్టులకు మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన - Tholi Paluku