
భైంసాలో రూ.30.32 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి శ్రీకారం
నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఆదివారం భైంసాలో రూ.30.32 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి, పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పట్టణంలో నిర్మించిన 440 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి, లబ్ధిదారులకు ఇంటి తాళాలు, గృహ పట్టాలను పంపిణీ చేశారు. సొంతింటి కల నెరవేరిన సందర్భంగా లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత ఇల్లు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత మంజూరుకు కూడా చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.
అనంతరం అమృత్ పథకం కింద రూ.28.18 కోట్లతో చేపట్టనున్న భైంసా పట్టణ తాగునీటి సరఫరా వ్యవస్థ ఆధునికీకరణ, కొత్త పైప్‌లైన్ల నిర్మాణం తదితర పనులకు మంత్రి భూమిపూజ నిర్వహించారు. అలాగే రూ.2.14 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మహదేవ్‌పూర్ చెరువు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత భైంసా పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు భూగర్భ జలాల మట్టాలు పెరిగి ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుందని మంత్రి తెలిపారు. పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధుల విషయంలో ఎలాంటి కొరత లేదని, ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
అలాగే పాల్సికర్ రంగారావు ప్రాజెక్టు కారణంగా నష్టపోయిన బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, అవినీతికి తావులేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
