
అద్దంకి మండలంలో విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి రవికుమార్
దూరభారం కారణంగా ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన సంకల్పమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ఆదివారం బాపట్ల జిల్లా అద్దంకి మండలం వెంపరాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యాభివృద్ధిని కాంక్షిస్తూ 32 మంది విద్యార్థినీ విద్యార్థులకు మంత్రి తన చేతుల మీదుగా ఉచిత సైకిళ్లను పంపిణీ చేశారు. రవాణా ఇబ్బందులు తొలగిస్తే గ్రామీణ విద్యార్థులు మరింత ఉత్సాహంతో ఉన్నత విద్య దిశగా అడుగులు వేస్తారని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అనంతరం విద్యార్థులలోని సృజనాత్మకతను, కళా నైపుణ్యాలను ప్రోత్సహించే ఉద్దేశంతో దాతల సహకారంతో పాఠశాల ఆవరణలో నూతనంగా నిర్మించిన ‘స్మారక కళా వేదికను మంత్రి ప్రారంభించారు. కేవలం చదువు మాత్రమే కాకుండా విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించడానికి ఇటువంటి వేదికలు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. పాఠశాల అభివృద్ధికి సహకరించిన దాతలను ఈ సందర్భంగా మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. నిరుపేద విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధనతో పాటు, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న ఈ సంస్కరణల వల్ల ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారి, విద్యార్థులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
