Let's talk: editor@tmv.in
ఆందోల్ నియోజకవర్గంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన

ఆందోల్ నియోజకవర్గంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన

Gaddamidi Naveen
19 ఏప్రిల్, 2026

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ శనివారం ఆందోల్ నియోజకవర్గంలో పర్యటిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. జోగిపేట పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సుమారు రూ.75 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. చౌట్‌కూర్ మండలం శివంపేటలోని జోగిపేట పాలిటెక్నిక్‌లో న్యూ ల్యాండ్ ఫౌండేషన్ సీఎస్ఆర్ నిధులతో రూ.43 లక్షలతో నిర్మించిన మెకానికల్ వర్క్‌షాప్ షెడ్‌ను ఆయన ప్రారంభించారు. అలాగే డీఎంఎఫ్‌టీ నిధులతో రూ.6 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన నాలుగు హైమాస్ట్ ఎల్ఈడి వీధి దీపాలను కూడా ప్రారంభించారు.

ఇక తోషిబా సంస్థ సీఎస్ఆర్ నిధులతో రూ.26 లక్షలతో ఏర్పాటు చేసిన ఆధునిక కంప్యూటర్ ల్యాబ్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, జోగిపేట పాలిటెక్నిక్ అభివృద్ధికి ఇప్పటివరకు మొత్తం రూ.2.35 కోట్లు సీఎస్ఆర్ నిధుల ద్వారా ఖర్చు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆయ‌న పేర్కొన్నారు. కళాశాల విద్యార్థులతో మంత్రి ప్రత్యేకంగా మమేకమై వారి అవసరాలు తెలుసుకున్నారు. భవిష్యత్తులో బాలికల వసతి గృహం నిర్మాణం, అదనపు వర్క్‌షాప్ షెడ్లు ఏర్పాటు వంటి అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్య, సర్పంచ్ సంధ్యారాణి, న్యూలాండ్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ డి.వి. రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.