
ఉస్మానియా వైద్యులకు మంత్రి దామోదర్ సన్మానం
దేశ వైద్య చరిత్రలోనే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్య బృందం అత్యంత అరుదైన ఘనతను సాధించింది. భారత్‌లోనే తొలిసారిగా ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో, ఒకే రోగికి ఒకేసారి ఐదు అవయవాలను (మల్టీ-విసెరల్) మార్పిడి చేసే శస్త్రచికిత్సను ఉస్మానియా డాక్టర్లు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ చారిత్రాత్మక విజయాన్ని సాధించిన వైద్య బృందాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శుక్రవారం డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఘనంగా సన్మానించారు.
ట్రాన్స్‌ప్లాంట్ బృందంలోని ప్రతి ఒక్కరికీ మంత్రి శాలువా కప్పి, ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఉస్మానియా డాక్టర్లు తెలంగాణతో పాటు యావత్ దేశానికే గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సల్లో ఒకటిగా భావించే ఈ మల్టీ-విసెరల్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ను డాక్టర్ మధుసూదన్ నేతృత్వంలోని బృందం ఏకధాటిగా 36 గంటల పాటు శ్రమించి విజయవంతం చేసిందని మంత్రి ప్రశంసించారు. ఈ అసాధారణ విజయం వెనుక కృషి చేసిన ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్లు, అనస్థీషియా నిపుణులు, గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు, క్రిటికల్ కేర్ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, కోఆర్డినేటర్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అలాగే, అవయవదానం ద్వారా మరొకరికి పునర్జన్మ ప్రసాదించిన దాత కుటుంబ సభ్యుల త్యాగాన్ని స్మరిస్తూ.. "అవయవదానం… మహాదానం" అనే సందేశాన్ని సమాజంలో ప్రతి ఒక్కరూ విస్తృతంగా చాటి చెప్పాలని పిలుపునిచ్చారు.
కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ హాస్పిటల్స్‌కు పోటీగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి దామోదర్ స్పష్టం చేశారు. గత రెండున్నర సంవత్సరాల కాలంలోనే ఆరోగ్యశాఖలో సుమారు 15 వేల పోస్టులను భర్తీ చేశామని, తాజాగా మరో 6,238 పోస్టులను మంజూరు చేశామని గుర్తుచేశారు. పాత, అద్దె భవనాల్లో నడుస్తున్న ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలకు కొత్త భవనాలు నిర్మిస్తున్నామని.. రోగ నిర్ధారణ కోసం అత్యాధునిక వైద్య పరికరాలు, అధునాతన ఆపరేషన్ థియేటర్లను అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు.
ప్రజలందరికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్యం అందించాలన్న ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా, వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేస్తూ జాతీయ స్థాయిలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెస్తున్నారని మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రశంసించారు.
