Let's talk: editor@tmv.in
రొయ్యల ఫీడ్ ధరల పెంపుపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం

రొయ్యల ఫీడ్ ధరల పెంపుపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం

Panthagani Anusha
13 మే, 2026

రాష్ట్రంలోని ఆక్వా రైతుల ప్రయోజనాలను విస్మరించి, ఫీడ్ ధరలను ఏకపక్షంగా పెంచిన కంపెనీలపై రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతులతో చర్చించకుండా ప్రభుత్వ అనుమతి లేకుండా ధరలు పెంచడం నిబంధనలకు విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. సామాన్య ఆక్వా సాగుదారులపై అదనపు భారం మోపే ఇటువంటి చర్యలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని ఆయన హెచ్చరించారు.

అయితే ఇటీవలి కాలంలో కొన్ని ఫీడ్ కంపెనీలు వనామీ ఫీడ్‌పై కిలోకు రూ.8, టైగర్ ఫీడ్‌పై రూ.10 చొప్పున ధరలను పెంచినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ పెంపు వల్ల పెట్టుబడి వ్యయం పెరిగి రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే పెంచిన ధరల అమలును నిలిపివేయాలని సదరు కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు సంబంధిత కంపెనీలకు ఇప్పటికే నోటీసులు పంపినట్లు పేర్కొన్నారు.

అప్సడా* *చట్టం ప్రకారం చర్యలు

రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని నియంత్రించేందుకు ఉన్న అప్సడా (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ) చట్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని మంత్రి గుర్తుచేశారు. "ఫీడ్ ధరల పెంపు వంటి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత కమిటీలో చర్చించి, ఆమోదం పొందడం తప్పనిసరి. చట్టాన్ని అతిక్రమించి సొంత నిర్ణయాలు తీసుకుంటే లైసెన్సుల రద్దుతో పాటు కఠిన చర్యలు తీసుకుంటాం," అని మంత్రి హెచ్చరించారు.

రైతు పక్షపాతిగా ప్రభుత్వం

ఆక్వా రంగాన్ని ఆదుకోవడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని అచ్చెన్నాయుడు పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ స్థానిక రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు. ఫీడ్ కంపెనీలు మొండిగా వ్యవహరిస్తే చట్టపరమైన పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.