Let's talk: editor@tmv.in
టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రి పై మంత్రి అచ్చెన్నాయుడు ఆకస్మిక తనిఖీ

టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రి పై మంత్రి అచ్చెన్నాయుడు ఆకస్మిక తనిఖీ

Panthagani Anusha
12 మే, 2026

ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే సహించేది లేదని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. సోమవారం ఆయన టెక్కలి జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ప్రతి వార్డును కలియతిరిగి రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లను పరిశీలించిన సమయంలో 44 మంది సిబ్బంది విధులకు గైర్హాజరైనట్లు గుర్తించి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆసుపత్రిలో ప్రధాన సమస్యగా ఉన్న తాగునీటి ఎద్దడిపై మంత్రి స్పందిస్తూ దీనిపై వెంటనే విచారణ జరపాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. కేవలం 24 గంటల్లోనే దీనిపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కోరారు. ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

రోగుల అవసరాల కోసం ప్రత్యేక చొరవ చూపిన మంత్రి , సీఎస్ఆర్ నిధుల ద్వారా రూ. 20 లక్షల విలువైన అత్యాధునిక వైద్య పరికరాలను ఆసుపత్రికి అందజేశారు. ఇందులో ఆపరేషన్ టేబుళ్లు, మల్టీపారా మానిటర్లు, వీన్ ఫైండర్స్ (నరాలను గుర్తించే పరికరాలు) పేషెంట్ కుర్చీలు ఉన్నాయి. ఈ పరికరాలను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని మూలన పడేయకూడదని అధికారులను ఆదేశించారు.

మరోవైపు ఆసుపత్రిలో సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, వాటిని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తున్న ప్రతిపక్షాల తీరును మంత్రి తప్పుబట్టారు. ఏదైనా సమస్య ఉంటే అధికారులకు చెప్పాలే తప్ప ఆసుపత్రిలో గొడవలు చేసి భయాందోళనలు సృష్టించడం సరైంది కాదన్నారు. ఇలాంటి పనులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

వైద్యులు భగవంతుడితో సమానమని పేదలకు అండగా నిలవాలని మంత్రి సూచించారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకే రోగులను వేరే ఆసుపత్రులకు పంపించకూడదని (రిఫర్ చేయకూడదని) స్థానికంగానే పూర్తిస్థాయిలో చికిత్స అందించాలని పేర్కొన్నారు.అదేవిదంగా ఆసుపత్రి ఆవరణను ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలని వైద్య సేవల్లో ఎటువంటి నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.