Let's talk: editor@tmv.in
మైనింగ్ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి.. నెల్లూరు కలెక్టరేట్ వద్ద చింతా మోహన్ ధర్నా

మైనింగ్ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి.. నెల్లూరు కలెక్టరేట్ వద్ద చింతా మోహన్ ధర్నా

Panthagani Anusha
22 ఏప్రిల్, 2026

రాష్ట్రంలో కొనసాగుతున్న మైనింగ్ మాఫియా అక్రమాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ పాల్గొని ప్రస్తుత కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

రూ.1,000 కోట్ల అవినీతి: చింతా మోహన్ ఆరోపణ

ధర్నాను ఉద్దేశించి చింతా మోహన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో అవినీతి పరాకాష్టకు చేరిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఏటా సుమారు రూ. 1,000 కోట్ల మేర అక్రమాలు జరుగుతున్నాయని నెలకు సగటున రూ. 300 కోట్ల అవినీతి సొమ్ము చేతులు మారుతోందని ధ్వజమెత్తారు. ముఖ్యంగా గూడూరు ప్రాంతంలో సిలికా, వెంకటగిరిలో క్వార్ట్జ్, సత్యవేడు నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయని మండిపడ్డారు. జిల్లా యంత్రాంగం, పోలీసుల సహకారం లేకుండా ఇంత భారీ స్థాయిలో అక్రమ మైనింగ్ జరగడం అసాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా ప్రభుత్వంలో 'ఫేవరిటిజం' (పక్షపాతం) పెరిగిపోయిందని విమర్శించిన ఆయన సహజ వనరులను కేవలం కొందరు వ్యక్తులకే కట్టబెట్టడం సరికాదన్నారు. సిలికా, క్వార్ట్జ్ గనులను నిరుద్యోగులైన ఎస్సీ, ఓబీసీ వర్గాలకు కేటాయించి వారికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలోని ఆరు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై స్పందిస్తూ గత ఎనిమిదేళ్లుగా పీఆర్‌సీ పెండింగ్‌లో ఉండటం దారుణమన్నారు. దీనిపై తక్షణమే స్పందించి పది రోజుల్లోగా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

అమరావతి పరిస్థితిపై ఆందోళన

మరోవైపు రాజధాని అమరావతి అభివృద్ధి తీరును ఆయన తప్పుబట్టారు. అమరావతి కాస్తా చంద్రావతి గా మారుతోందని ఎద్దేవా చేశారు. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మన్నవరం బీహెచ్‌ఈఎల్ కర్మాగారం నేడు ఏ విధంగా నిర్వీర్యమైందో సరైన ప్రణాళిక లేకపోతే అమరావతికి కూడా అదే గతి పడుతుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.