Let's talk: editor@tmv.in
బాసర సరస్వతి ఆలయంలో అర్ధరాత్రి చోరీ

బాసర సరస్వతి ఆలయంలో అర్ధరాత్రి చోరీ

Gaddamidi Naveen
24 జూన్, 2026

నిర్మల్ జిల్లాలోని సుప్రసిద్ధ పురాతన క్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సోమవారం రాత్రి భారీ చోరీ జరిగింది. ఆలయ ఆవరణలోని పై అంతస్తులో కొలువై ఉన్న మహంకాళి అమ్మవారి ఉపాలయంలోకి చొరబడిన దుండగులు అమ్మవారి వెండి కిరీటాన్ని, హుండీలోని నగదును దోచుకెళ్లినట్లు ఆలయ అధికారులు మంగళవారం ఉదయం వెల్లడించారు.

మంగళవారం తెల్లవారుజామున అర్చకులు నిత్య పూజా కార్యక్రమాల కోసం ఆలయానికి వెళ్లడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని దొంగలు మహంకాళి ఆలయ ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అమ్మవారిని అలంకరించిన వెండి కిరీటాన్ని అపహరించడంతో పాటు, అక్కడ ఉన్న హుండీని ఎత్తుకెళ్లారు. హుండీలోని నగదు మొత్తాన్ని తీసుకున్న అనంతరం, ఖాళీ హుండీని ప్రాంగణంలోని మరో ఉపాలయం వద్ద పడేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంలోనే ఈ స్థాయి దొంగతనం జరగడం భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఆలయ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. బాసర ఆలయ ప్రాంగణంలోనే చోరీ జరగడం భద్రతా లోపాలను బయటపెట్టిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ఆలయ అధికారుల నుంచి అందిన ఫిర్యాదు ఆధారంగా బాసర పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్‌లు
BasarBasaraGnanaSaraswatiTempleSaraswatiTempleMahankaliTempleTempleTheftBasarTempleNirmalDistrictTelanganaNewsBreakingNews
బాసర సరస్వతి ఆలయంలో అర్ధరాత్రి చోరీ - Tholi Paluku