Let's talk: editor@tmv.in
రెండో విడతలో 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం

రెండో విడతలో 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు, జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం

Gaddamidi Naveen
25 మే, 2026

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం రాత్రి జరిగిన తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో (11, 12వ తరగతి) విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టాలని మంత్రిమండలి నిర్ణయించింది. అలాగే ప్రతిష్టాత్మక ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకం రెండో విడత కింద 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేయడానికి ఆమోదం తెలిపింది.

సమావేశం అనంతరం సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి విడతలో రూ.22,500 కోట్ల వ్యయంతో 4.50 lakh ఇళ్లను మంజూరు చేసిందని గుర్తుచేశారు. తాజాగా రెండో విడతలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2,000 ఇళ్ల చొప్పున కేటాయించనున్నట్లు తెలిపారు. జూన్‌ 1న ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించనున్నారు.

వీటితో పాటు గ్రామీణ ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌ కోర్‌ అర్బన్‌ ఏరియా పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ ప్రాంతాల్లో ఇంటి స్థలాలు లేని నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలకు వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాల్లోనే స్థలాలను గుర్తించి ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 15 వేల కుటుంబాలు ఇప్పటికీ పూరిగుడిసెల్లో జీవిస్తున్నట్టు సర్వేల్లో తేలడంతో, ఆ కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందించాలని కేబినెట్‌ నిర్ణయించింది.

రూ.2.10 లక్షల కోట్ల లైఫ్ సైన్సెస్ పాలసీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థిక ఫోరమ్ లో ఆవిష్కరించిన ‘నెక్స్ట్-జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30’ కి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ విధానం ద్వారా రాబోయే ఐదేళ్లలో 25 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.10 లక్షల కోట్లు) పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దీని ద్వారా 2030 నాటికి తెలంగాణను ప్రపంచంలోని టాప్-5 లైఫ్ సైన్సెస్ హబ్‌లలో ఒకటిగా నిలపాలని ప్రభుత్వం భావిస్తోంది.

గోదావరి పుష్కరాలు 2027

2027 గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించిన వివిధ పనుల కోసం రూ.1000 కోట్లు కేటాయించగా, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్డీఎస్ఎస్‌ పథకంలో చేరేందుకు తెలంగాణ డిస్కంలు సిద్ధం చేసిన ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అవసరమైన భూసేకరణ, పునరావాసం, మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.587 కోట్లు కేటాయించారు.