
నెల్లూరు జిల్లాకు ‘మెగా’ ప్రాజెక్ట్..రూ.1,615 కోట్లతో భారీ కార్గో రైల్ టెర్మినల్
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధిలో మరో భారీ మైలురాయి పడనుంది. నెల్లూరు జిల్లాలో రవాణా, వాణిజ్య రంగాల రూపురేఖలను మార్చేలా రామాయపట్నం సమీపంలో అత్యాధునిక ‘హెవీ కార్గో రైల్ టెర్మినల్’ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. సుమారు రూ.1,615 కోట్ల భారీ వ్యయంతో పట్టాలెక్కనున్న ఈ ప్రాజెక్ట్ రామాయపట్నం పోర్టును దేశీయ రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానిస్తూ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకోనుంది. జిల్లాలోని తెట్టు సమీపాన గల చేవూరు, రావూరు–మోచర్ల గ్రామాల మధ్య ఈ మెగా ప్రాజెక్ట్ ఏర్పాటు కానుంది.
ఈ భారీ టెర్మినల్‌ను సుమారు 429 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ‘రామాయపట్నం కార్గో రిసెప్షన్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ పేరుతో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1,300 మంది స్థానిక యువతకు నేరుగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అంతేకాకుండా గిడ్డంగులు, ప్యాకేజింగ్, రవాణా, లాజిస్టిక్స్ రంగాల్లో వేలాది మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుందని అంచనా. నెల్లూరు జిల్లాను దక్షిణ భారత దేశంలోనే ప్రధాన లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశమని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ టెర్మినల్‌లో కేవలం సరుకు రవాణాకే పరిమితం కాకుండా విభిన్న రంగాలకు అవసరమైన అత్యాధునిక సదుపాయాలను కల్పించనున్నారు. ముఖ్యంగా బల్క్ హ్యాండ్లింగ్ సదుపాయాలు, ఆటోమొబైల్ యార్డులు, లాజిస్టిక్స్ పార్కులతో పాటు త్వరగా పాడయ్యే వస్తువుల కోసం ప్రత్యేకంగా ‘కోల్డ్ చైన్’ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు.
ప్రాజెక్ట్ కాలపరిమితి విషయానికొస్తే దీనిని మొత్తం నాలుగు దశల్లో పూర్తి చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. మొదటి దశ పనులను 2027 జనవరి నాటికి పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మిగిలిన మూడు దశల పనులను పూర్తి చేసి 2028 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. రైలు-రోడ్డు మార్గాల అనుసంధానంతో రామాయపట్నం పోర్టుకు ఈ టెర్మినల్ వెన్నెముకగా నిలవనుంది తద్వారా రాష్ట్ర ఆదాయం పెరగడంతో పాటు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి భారీ ఊతం లభించనుంది.
