
యువగళం హామీల అమలు దిశగా మెగా జాబ్ మేళా: ఎమ్మెల్యే పులివర్తి నాని
చంద్రగిరి నియోజకవర్గంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మెగా జాబ్ మేళాను నిర్వహించినట్లు ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. తిరుపతి రూరల్ మండలం తనపల్లిలోని రఘునాథ్ రిసార్ట్స్‌లో ఉన్న చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. హెచ్ ఫాక్స్‌కాన్ సంస్థ సహకారంతో నిర్వహించిన ఈ జాబ్ మేళాకు యువత నుంచి విశేష స్పందన లభించింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి దెబ్బతినడంతో పాటు నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చిందన్నారు. పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన సమయంలో వాటిని ఇతర రాష్ట్రాలకు వెళ్లేలా చేశారని విమర్శించారు. యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలకు అనుగుణంగానే ప్రస్తుతం మెగా జాబ్ మేళాల ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
నియోజకవర్గంలోని అన్ని మండలాల యువతకు ఉపాధి అవకాశాలు అందించే వరకు తమ ప్రయత్నాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ అవకాశంలో ఎంపిక కాకపోయిన వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, త్వరలో ఐటీ సంస్థలు కూడా నియోజకవర్గానికి రానున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా వందలాది మందికి స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణతో ఉద్యోగాలు లభించాయని వెల్లడించారు. జాబ్ మేళాలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఎమ్మెల్యే పులివర్తి నాని స్వయంగా నియామక పత్రాలు అందజేసి అభినందించారు.
