
రాజమండ్రిలో రేపు మెగా ఉచిత మెడికల్ క్యాంప్
రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల కోసం ఈనెల 10వ తేదీ ఆదివారం మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. స్థానిక కృష్ణనగర్ కొత్తరోడ్డులోని వివి గార్డెన్స్‌లో ఈ శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. మొత్తం దాదాపు 25 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు వివిధ విభాగాల్లో ఉచిత వైద్య సేవలు అందించనున్నారు.
క్యాన్సర్, హృదయ సంబంధిత వ్యాధులు, కిడ్నీ, ఊపిరితిత్తులు, కీళ్ల నొప్పులు, న్యూరో, డెంటల్, గైనకాలజీ వంటి విభాగాలకు చెందిన నిపుణులు ఈ శిబిరంలో సేవలు అందించనున్నారు. రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన మందులను కూడా ఉచితంగా పంపిణీ చేయనున్నారు.
ప్రత్యేకంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైనవారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయనున్నట్లు భరత్ తెలిపారు. పేద ప్రజలకు ఉచితంగా ఆపరేషన్లు చేయించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు.
కాగా ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ సేవలు సరిగా అందడం లేదని ఆసుపత్రుల్లో అధిక ఖర్చులు విధిస్తున్నారని ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రాజమండ్రి మాత్రమే కాకుండా గోదావరి జిల్లాల ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మీడియా ప్రతినిధులు కూడా కుటుంబ సమేతంగా హాజరై సేవలను వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, డా.గూడూరి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వాసంశెట్టి గంగాధరరావు తదితరులు పాల్గొన్నారు.
