Let's talk: editor@tmv.in
మెగా డీఎస్సీ-2025 పారదర్శకంగా నిర్వహించాం:విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్

మెగా డీఎస్సీ-2025 పారదర్శకంగా నిర్వహించాం:విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్

Panthagani Anusha
1 జూన్, 2026

మెగా డీఎస్సీ-2025 నిర్వహణపై ఇటీవల వస్తున్న ఆరోపణలు, అవాస్తవ ప్రచారాలను రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు విద్యాభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డీఎస్సీ నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు లేదా అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. గతేడాది డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారంతా తమ స్వయం ప్రతిభతో కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతో కొన్ని పార్టీలు, మీడియా సంస్థలు చేస్తున్న ఆరోపణలకు ఆయన ఈ సందర్భంగా ఆధారాలతో సహా సమాధానాలు ఇచ్చారు.

రాష్ట్రంలో 2018 తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం 2025లో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేశామని కోన శశిధర్ తెలిపారు. ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు కొన్ని శక్తులు ఏకంగా 241 కేసులు దాఖలు చేసినప్పటికీ న్యాయస్థానాల్లో ప్రభుత్వం తరఫున సమర్థవంతంగా వాదనలు వినిపించామన్నారు. కోర్టు అనుమతులు సాధించి కేవలం 148 రోజుల్లోనే మొత్తం నియామక ప్రక్రియను రికార్డు స్థాయిలో పూర్తి చేసినట్లు వెల్లడించారు. టెట్-డీఎస్సీ మధ్య పూర్తి సమన్వయంతో, అత్యంత పారదర్శకంగా పరీక్షలను నిర్వహించామని.. నార్మలైజేషన్ ప్రక్రియ, రిజర్వేషన్ల అమలు, ఎంపిక విధానం వంటి ప్రతి అంశాన్ని ముందుగానే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని ఆయన వివరించారు. ఎస్సీ వర్గీకరణతో పాటు వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్లను నిబంధనల ప్రకారమే అమలు చేశామని స్పష్టం చేశారు.

అత్యున్నత సాంకేతికత, భద్రతతో పరీక్షలు

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలను నిర్వహించే ‘టీసీఎస్ ఐయాన్’ (TCS iON) సంస్థ ఆధ్వర్యంలో, 154 కేంద్రాల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించినట్లు కార్యదర్శి తెలిపారు. ఒకే సబ్జెక్టుకు వేర్వేరు రోజుల్లో పరీక్షలు జరపాల్సి రావడంతో వేర్వేరు ప్రశ్నపత్రాలను ఉపయోగించాల్సి వచ్చిందన్నారు. ప్రతి సబ్జెక్టుకు సుమారు 3 వేల ప్రశ్నలతో అత్యంత సురక్షితమైన ప్రశ్నాబ్యాంక్‌ను రూపొందించాం. దీనికి కేవలం ఇద్దరు శాశ్వత ఉద్యోగులకే యాక్సెస్ ఉండేది. పైగా పాస్‌వర్డ్‌లు ప్రతిరోజూ మారే విధంగా కఠినమైన భద్రతా చర్యలు తీసుకున్నాం. కాబట్టి ప్రశ్నపత్రాల లీకేజీకి ఎక్కడా ఎలాంటి అవకాశం లేదు." అని శశిధర్ స్పష్టం చేశారు.

టెట్, డీఎస్సీ స్కోర్లు, జిల్లా వారీ ఫలితాలు అన్నీ వెబ్‌సైట్‌లో ముందుగానే ప్రచురించామని, స్కోర్లు ఇవ్వలేదనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి వెయిటింగ్ లిస్టు విధానానికి బదులుగా 1:1 నిష్పత్తిలోనే అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు పిలిచి, ఆ ప్రక్రియను కూడా పారదర్శకంగా ముగించామని చెప్పారు. హారిజాంటల్ రిజర్వేషన్లపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. స్పోర్ట్స్, మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికుల కోటాలను నిబంధనల మేరకే అమలు చేశామని, కొందరికి ఈ విధానంపై అవగాహన లేకపోవడం వల్లే అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

వివాదాలపై వివరణ.. త్వరలో మరో డీఎస్సీ

ఇటీవల చర్చనీయాంశమైన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి నవీన్ వ్యవహారంపై కోన శశిధర్ ప్రత్యేకంగా వివరణ ఇచ్చారు. నవీన్ రెండు పోస్టులకు అర్హత సాధించినప్పటికీ, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరుకాలేదని, అందువల్ల నిబంధనల ప్రకారమే అతనికి నియామకం జరగలేదన్నారు. అనంతరం ఆయన కోర్టును ఆశ్రయించగా, ప్రభుత్వం సమర్పించిన వాదనలతో ఏకీభవిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చిందని తాము కోర్టు ఆదేశాలను పూర్తిగా పాటించామని తెలిపారు.

ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడ్డాయని, ప్రభుత్వ-ప్రైవేట్ పాఠశాలల మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులే స్వయంగా విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ బడుల్లో చేర్పిస్తున్న వాతావరణం ఉందన్నారు. కష్టపడి ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులను అవాస్తవ ప్రచారాలతో మానసికంగా ఇబ్బంది పెట్టవద్దని కోరారు. శాఖాపరంగా ఏవైనా లోపాలు ఉంటే సూచనలు స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న ఆయన త్వరలోనే రాష్ట్రంలో మరో డీఎస్సీ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కీలక ప్రకటన చేశారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ అభ్యర్థులను తప్పుదోవ పట్టిస్తున్న వారిపై ఇప్పటికే కేసులు నమోదు చేశామని, భవిష్యత్తులోనూ ఇటువంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.