Let's talk: editor@tmv.in
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో మీనాక్షి నటరాజన్‌ భేటీ

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో మీనాక్షి నటరాజన్‌ భేటీ

Gaddamidi Naveen
16 ఏప్రిల్, 2026

తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), పార్టీ వ్యవహారాలపై రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం కీలక సమావేశం నిర్వహించింది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ కలిసి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డితో బుధవారం హైదరాబాద్‌లో విస్తృతంగా చర్చలు జరిపారు. సుమారు నాలుగున్నర గంటల పాటు పాటు సాగిన ఈ సమావేశంలో పలు వ్యూహాత్మక అంశాలపై దృష్టి సారించారు.

ప్రధానంగా డిలిమిటేషన్ నేపథ్యంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, రాజకీయ వ్యూహాలపై లోతైన చర్చ జరిగింది. ఇదే సమయంలో పార్టీ సంస్థాగత వ్యవస్థను బలోపేతం చేయడానికి వర్కింగ్ ప్రెసిడెంట్లు, కార్యదర్శులు తదితర కీలక పదవుల నియామకాలపై కూడా చర్చించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఫెడరేషన్లలో ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేసే అంశాన్ని పరిశీలించారు. ఈ నియామకాలపై వచ్చే రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇక కేంద్ర స్థాయిలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏప్రిల్ 16 నుంచి 18 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా మహిళలకు లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో 33 శాతం రిజర్వేషన్ కల్పించే ‘నారీ శక్తి వందన్ అధినియం’ అమలుకు సంబంధించి సవరణలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ చట్టాన్ని 2029 ఎన్నికలకు ముందే అమలు చేయడానికి లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుత 543 నుంచి 850కి పెంచే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. ఇందుకోసం తాజా జనగణన ఆధారంగా డిలిమిటేషన్ చేపట్టనున్నారు.