
అమరావతి పురోగతిని జీర్ణించుకోలేకే ‘మావిగన్’ సిద్ధాంతం: మంత్రి రవికుమార్
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ప్రతిపాదన ప్రజల మద్దతు పొందడంలో పూర్తిగా విఫలమైందని ఆ పరాభవాన్ని కప్పిపుచ్చుకోవడానికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్తగా “మావిగన్” క్యాపిటల్ కారిడార్ సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి జి. రవి కుమార్ తీవ్ర విమర్శలు చేశారు.
కూటమి ప్రభుత్వ హయాంలో అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందుతుండటాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి రవికుమార్ ఆరోపించారు. అందువల్లే మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాలను కలిపే “మావిగన్” ప్రతిపాదనను ఆయన తెరపైకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. గతంలో తాము తెచ్చిన మూడు రాజధానుల ఆలోచనను ప్రజలు తిరస్కరించిన విషయాన్ని దాచిపెట్టి రాజకీయ మనుగడ కోసం ఈ కొత్త సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఇటీవల జగన్ నిర్వహించిన మీడియా సమావేశంలో “మావిగన్” కారిడార్ ప్రతిపాదనను సమర్థించుకుంటూ చేసిన వ్యాఖ్యలను మంత్రి ప్రస్తావించారు. గ్రీన్‌ఫీల్డ్ రాజధానిగా అమరావతిలో మౌలిక సదుపాయాల నిర్మాణానికే సుమారు రూ.2 లక్షల కోట్లు అవసరమవుతాయని అదే మావిగన్ కారిడార్ అభివృద్ధికి ఆ మొత్తంలో కేవలం 10 శాతం మాత్రమే ఖర్చవుతుందని జగన్ వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పుపట్టారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను అనుసంధానిస్తూ అభివృద్ధి చేయడం రాష్ట్రానికి ఆర్థికంగా ప్రయోజనకరమన్న జగన్ వాదనలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని ఇవి రాష్ట్ర ప్రయోజనాలకు హానికరంగా మారే ప్రమాదం ఉందని మంత్రి హెచ్చరించారు. ఇలాంటి పొంతన లేని మాటలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మబోరని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో జగన్ తన మీడియా సమావేశంలో తన తాత, తండ్రి, మామ మరణాల అంశాలను ప్రస్తావించడంపై మంత్రి రవి కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై ఇంకా అనుమానాలు ఉన్నాయని జగన్ వ్యాఖ్యానించడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆరోపించారు. 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పూర్తి అధికారంలో ఉన్న సమయంలో జగన్ ఈ అనుమానాలపై ఎందుకు విచారణ జరిపించలేదని ఎందుకు చర్యలు తీసుకోలేదని రవికుమార్ నిలదీశారు. ఇప్పటికైనా ప్రజల్లో సానుభూతి పొందే చౌకబారు ప్రయత్నాలు మానుకుని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని జగన్‌కు మంత్రి హితవు పలికారు.
