Let's talk: editor@tmv.in
కూటమి రెండేళ్ల పాలనపై వైఎస్సార్‌సీపీ అద్దంకిలో భారీ నిరసన
కూటమి రెండేళ్ల పాలనపై వైఎస్సార్‌సీపీ అద్దంకిలో భారీ నిరసన

కూటమి రెండేళ్ల పాలనపై వైఎస్సార్‌సీపీ అద్దంకిలో భారీ నిరసన

Gaddamidi Naveen
13 జూన్, 2026

కూటమి ప్రభుత్వం అబద్ధపు ప్రచారాలు, అలివిగాని హామీలతో అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా సామాన్య ప్రజలను ఘోరంగా మోసం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.సీఎం చంద్రబాబు నాయుడు ప్రజావ్యతిరేక విధానాలు, నమ్మకద్రోహ రాజకీయాలకు నిరసనగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపుమేరకు శుక్రవారం అద్దంకి పట్టణంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.

పట్టణంలోని 20వ వార్డులో ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి అశోక్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుంచి పార్టీ శ్రేణులు, మహిళలతో ప్రారంభమైన శాంతియుత నిరసన ర్యాలీ బంగ్లా సెంటర్ వరకు కొనసాగింది. అక్కడ అమరజీవి పొట్టి శ్రీరాములు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు.

ఈ సందర్భంగా డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం సాధించింది ఏమీ లేదని, కేవలం 'రెడ్ బుక్' పట్టుకుని వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ. 1500 ఇస్తామని చెప్పి ఒక్కరికీ ఇవ్వలేదన్నారు.

ఎన్నికల ముందు వాలంటీర్లను అవమానపరిచిన కూటమి నేతలు, ఇప్పుడు ఆడపిల్లలపై అన్యాయం జరుగుతుంటే నోరు విప్పడం లేదని, సుగాలి ప్రీతి కేసును పక్కనబెట్టేశారని విమర్శించారు. సాక్షాత్తు కూటమి ఎంపీ డ్రగ్స్‌తో పట్టుబడితే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారని ఆరోపించారు. జగనన్న రూ. 25 లక్షల వరకు విస్తరించిన ‘ఆరోగ్యశ్రీ’ పథకానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని, సీఎం రిలీఫ్ ఫండ్‌ను సొంత ఆసుపత్రులకు దండుకుంటున్నారని అశోక్ కుమార్ ఆరోపించారు. పాఠశాలలు తెరిచినా విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు లేవని, ‘అమ్మ ఒడి’ ఊసే లేదని, డీఎస్సీలో అర్హులను పక్కనబెట్టి పేకాట ఆడేవారికి ఉద్యోగాలిచ్చారని మండిపడ్డారు.