Let's talk: editor@tmv.in
బీచ్ షాక్స్ విధానానికి వ్యతిరేకంగా విశాఖలో మహిళల భారీ నిరసన

బీచ్ షాక్స్ విధానానికి వ్యతిరేకంగా విశాఖలో మహిళల భారీ నిరసన

Gaddamidi Naveen
7 జులై, 2026

విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో బీచ్ షాక్స్ విధానానికి వ్యతిరేకంగా వైయస్‌ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. సముద్ర తీర ప్రాంతాల్లో బీచ్ షాక్స్ ఏర్పాటు చేసి మద్యం విక్రయాలకు అనుమతిస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 362ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

ఈ నిరసనలో విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వేలాది మంది మహిళలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నల్ల బెలూన్లు, నల్ల రిబ్బన్లతో నిరసన వ్యక్తం చేశారు. బీచ్ రోడ్ అంతటా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైయస్‌ఆర్సీపీ మహిళా విభాగం చేపట్టిన ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. వరుదు కళ్యాణి, బొత్స ఝాన్సీ లక్ష్మి, గొల్ల బాబురావు, కేకే రాజు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు ర్యాలీలో పాల్గొని మహిళలకు సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, గోవా తరహా సంస్కృతిని ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టి అందమైన విశాఖ తీరాన్ని మద్యం సేవించే వారి కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బీచ్‌లలో మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడం వల్ల కుటుంబాలు, మహిళలు, విద్యార్థులు స్వేచ్ఛగా బీచ్‌కు వచ్చే పరిస్థితి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యాటక రంగం అభివృద్ధి పేరుతో మహిళల భద్రతను, ప్రజల ప్రశాంతతను పణంగా పెట్టే నిర్ణయాలను ప్రజలు అంగీకరించరని హెచ్చరించారు. జీవో నెంబర్ 362ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకుని ప్రజల అభిప్రాయాలను గౌరవించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు
VizagRKBeachBeachShacksYSRCPAndhraPradeshVisakhapatnamGO362BeachProtestWomenSafetyAPPoliticsBeachRoadGo362Tourism
బీచ్ షాక్స్ విధానానికి వ్యతిరేకంగా విశాఖలో మహిళల భారీ నిరసన - Tholi Paluku