


తమిళనాడులో బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 23 మంది మృతి!
తమిళనాడు రాష్ట్రం విరుదునగర్ జిల్లాలో ఆదివారం ఘోర ప్రమాదం సంభవించింది. ఒక ప్రైవేట్ బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడులో 23 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. కట్టనార్‌పట్టి సమీపంలోని ‘వనజ’ ఫైర్‌వర్క్స్‌లో జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు, మంటలతో భీతావహంగా మారిపోయింది. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో ఘటనాస్థలి అత్యంత భయానకంగా మారింది.
వరాండాలో పనులు చేస్తుండగా..
వాచకారపట్టి పోలీస్ స్టేషన్ పరిధిలో ముత్తుమాణిక్యం అనే వ్యక్తికి చెందిన ఈ యూనిట్‌లో సుమారు 100 మందికి పైగా కార్మికులు విధుల్లో ఉన్నారు. మధ్యాహ్న సమయంలో ఫ్యాక్టరీ ముందున్న వరాండాలో కార్మికులు బాణసంచా ముడిపదార్థాలను కలిపి, ఫినిషింగ్ పనులు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగి భారీ పేలుడు సంభవించింది. క్షణాల్లోనే మంటలు యూనిట్ మొత్తానికి విస్తరించడంతో లోపల ఉన్నవారికి తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది.
నేలమట్టమైన భవనాలు
పేలుడు ధాటికి మూడు గదులు పూర్తిగా నేలమట్టం కాగా, పక్కనే ఉన్న పలు నిర్మాణాలు కూడా కుప్పకూలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నప్పటికీ, లోపల ఉన్న టపాసులు నిరంతరాయంగా పేలుతుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. శిథిలాల కింద ఇంకా కొందరు కార్మికులు చిక్కుకుని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. రాత్రి వరకు కొనసాగిన గాలింపు చర్యల్లో ఇప్పటివరకు 23 మృతదేహాలను వెలికితీశారు.
బాధితుల్లో ముగ్గురు మహిళా కార్మికులు
ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే విరుదునగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. గాయపడిన వారిలో ముగ్గురు మహిళలు ఉండగా, వారికి 60 శాతానికి పైగా కాలిన గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స అందించాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు.
నిబంధనల ఉల్లంఘనేనా?
ప్రమాదానికి గురైన ‘వనజ’ యూనిట్‌కు నాగ్‌పూర్‌లోని పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ నుంచి అనుమతులు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే వరాండా వంటి బహిరంగ ప్రదేశాల్లో మందుగుండు పనులు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే జిల్లాలోని వెంబకోట్టైలో జరిగిన పేలుడులో నలుగురు మరణించిన ఘటన మరవకముందే ఈ భారీ విషాదం చోటుచేసుకోవడం గమనార్హం.
రంగంలోకి మంత్రుల బృందం
విషయం తెలిసిన వెంటనే తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మంత్రులు కేకేఎస్‌ఎస్ఆర్ రామచంద్రన్, తంగం తెన్నరసులను తక్షణమే ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌తో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, బాధితులకు అండగా నిలవాలని ఆయన సూచించారు.
కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు
ఒక్కసారిగా జరిగిన ఈ ఘోర ప్రమాదంతో కట్టనార్‌పట్టి గ్రామం కన్నీరు మున్నీరవుతోంది. తమ వారు పనికి వెళ్లి విగతజీవులై తిరిగి రావడంతో బాధితుల బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో తమ వారిని గుర్తించడం కూడా కష్టంగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో జిల్లాలోని ఇతర బాణసంచా కేంద్రాల్లోని కార్మికులు కూడా భయాందోళనలకు గురవుతున్నారు.
సమగ్ర విచారణకు ఆదేశం
ఈ భారీ పేలుడుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఏడాదిలోనే ఇదే అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదంగా అధికారులు పేర్కొంటున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యంపై ప్రాథమిక ఆధారాలు సేకరిస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. సహాయక చర్యలు పూర్తయిన తర్వాతే మృతుల పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు ఘటన పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ఉదయాన్నే పని కోసం వెళ్లిన కార్మికులు ఇలా ప్రాణాలు కోల్పోవడం తనను ఎంతగానో కలిచివేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
