
నికోబార్ దీవుల్లో భారీగా పర్యావరణ దోపిడీ: రాహుల్‌గాంధీ
అండమాన్–నికోబార్ దీవుల్లో భారీ స్థాయిలో భూకబ్జా, పర్యావరణ నాశనం, పరిపాలనా అవినీతి జరుగుతోందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ ఆరోపించారు. గిరిజన హక్కులు, పర్యావరణ రక్షణ నిబంధనలు యథేచ్చగా ఉల్లంఘిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఆయన విజయపురంలో మీడియాతో మాట్లాడుతూ మీ భూములను తీసుకుని అదానీ గ్రూప్ వంటి పెద్ద వ్యాపారులకు ఇస్తున్నారు. అటవీ చట్టం అమలు కావడం లేదు. గిరిజనులు, స్థానికులకు సరైన పరిహారం అందడం లేదు. నిశ్శబ్దంగా భారత వారసత్వాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని దేశ ప్రజలకు తెలియజేస్తామని, దీవుల్లో ప్రజల హక్కులను కాపాడేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.
గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్‌పై తీవ్ర విమర్శలు
అండమాన్‌లో నీటి సమస్యతో పాటు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం వైఖరిపై కూడా రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఇక్కడ ఎల్జీ రాజులా వ్యవహరిస్తున్నారు. ప్రజలను కలవడం లేదు. ఇది ప్రజాస్వామ్యం కాదని అన్నారు. ఇక్కడ అసలు సమస్య పర్యావరణ దోపిడీ. లక్షల కోట్ల విలువైన చెట్లను నరుకుతున్నారు. భూములను ఆక్రమించడం ప్రధాన సమస్య అని ఆయన వ్యాఖ్యానించారు. హోర్ముజ్ అంశాన్ని ప్రస్తావించాల్సిన అవసరం లేదని కూడా తెలిపారు. గ్రేట్ నికోబార్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్‌లలో ఒకటిగా, ప్రకృతి, గిరిజన వారసత్వంపై అత్యంత తీవ్రమైన దాడిగా ఆయన అభివర్ణించారు. సుమారు 160 చదరపు కిలోమీటర్ల రైన్‌ఫారెస్ట్ నాశనం అవుతుందని, లక్షల సంఖ్యలో చెట్లు నరుకుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అభివృద్ధి కాదు… అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసమని అన్నారు.
ప్రజల ఆందోళనలు
కాంప్‌బెల్ బే ప్రాంతంలో గిరిజన నాయకులతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. ప్రాజెక్ట్‌పై పారదర్శకత లేకపోవడం, పర్యావరణ ప్రమాదాలు, గిరిజన హక్కుల నిర్లక్ష్యం వంటి అంశాలపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దీవిలో నివసించే ప్రతి ఒక్కరూ ఈ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా ఉన్నారు. తమ భూములకు ఎంత పరిహారం ఇస్తారో కూడా తెలియదని ఆయన అన్నారు. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతానని హామీ ఇచ్చారు.
కేంద్రం వైఖరి
కేంద్ర ప్రభుత్వం మాత్రం రూ.81,000 కోట్ల గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ దేశానికి వ్యూహాత్మకంగా, ఆర్థికంగా కీలకమని చెబుతోంది. ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్, పవర్ ప్లాంట్, టౌన్‌షిప్ వంటి ప్రాజెక్టులతో సముద్ర వాణిజ్యం, కనెక్టివిటీ, భద్రత పెరుగుతాయని పేర్కొంది. ఏప్రిల్ 26న అండమాన్ చేరుకున్న రాహుల్‌గాంధీ నికోబారీస్ గిరిజనులు, స్థానికులతో సమావేశమయ్యారు. ఇందిరా పాయింట్‌ను సందర్శించి మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి నివాళులు అర్పించారు.
