


పుట్టపర్తిలో భారీ డిఫెన్స్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం
శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రక్షణ, పారిశ్రామిక చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలైంది. ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్మించనున్న 'అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్' ( ఆమ్కా ) ఇంటిగ్రేషన్, ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఘనంగా శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.15,803 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ మెగా ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. పుట్టపర్తి కేంద్రంగా భారత రక్షణ రంగ శక్తిని ప్రపంచానికి చాటిచెప్పే దిశగా అడుగులు పడటం గమనార్హం.
ఏపీ ఇక అడ్వాన్స్డ్ ప్రదేశ్- రాజ్ నాధ్ సింగ్
ఈ సందర్భంగా ఆమ్కా ప్రాజెక్టు ఏపీ సహా దేశ రక్షణలో ఓ చారిత్రాత్మక అధ్యాయాన్ని సృష్టిస్తుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గూగుల్ లాంటి ఐటీ దిగ్గజ కంపెనీలతో పాటు రక్షణ రంగ పరిశ్రమల్ని ఆకర్షిస్తున్న ఏపీ పేరు అడ్వాన్స్డ్ ప్రదేశ్ అని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. 5 జనరేషన్ ఆధునిక స్టెల్త్ యుద్ధ విమానాల్ని తయారు చేస్తున్న రాయలసీమను మిలటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సుగా అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. రూ.15 వేల కోట్ల విలువైన పెట్టుబడితో ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ తో పాటు ఆధునిక ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామని ఇలాంటి ఫ్లైట్ టెస్టింగ్ కేంద్రాలు కేవలం కొద్దిదేశాల వద్ద మాత్రమే ఉన్నాయని.. ఇప్పుడు భారత్ కూడా ఆ సరసన చేరిందని అన్నారు. అమ్కా ప్రాజెక్టుతో తయారైన ఆధునిక యుద్ధ విమానాలు మన రక్షణ శక్తిని చాటేలా మన గగనశక్తిని చాటేలా పుట్టపర్తి నుంచి టేకాఫ్ అవుతాయని కేంద్ర మంత్రి వివరించారు. ఆ తరహా యుద్ధ విమానాలను పుట్టపర్తి నుంచి తయారు చేయబోతున్నామని తెలిపారు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కూడా రూ.480 కోట్లతో ఆధునిక అటానమస్ అండర్ వాటర్ వ్యవస్థలను, టార్పెడోలను ఉత్పత్తి చేస్తుందన్నారు. ఇప్పటి వరకూ దిగుమతి చేసుకుంటున్న చాలా పరికరాలను కూడా స్వదేశీయంగా తయారు చేసుకోగలమని చెప్పారు.
7 సంస్థలతో ఒప్పందాలు
అంతకు ముందు రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్, సీఎం చంద్రబాబు సమక్షంలో 7 సంస్థలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. రూ. 4460 కోట్ల పెట్టుబడులు, 6400 మందికి ఉద్యోగాలు కల్పించేలా ఈ ఒప్పందాలు కుదిరాయి. భారత్ ఫోర్జ్, రఘువంశీ మెషీన్ టూల్స్, సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ , ఎన్ఐబీఈ గ్రూప్, పీఎంటీ డిఫెన్స్, చక్రవ్యూహ్ డైనమిక్స్ , ఇండస్ బ్రిడ్జ్ వెంచర్స్ సంస్థలు ఈ ఎంఓయూలు కుదుర్చుకున్నాయి.
36 రోజుల్లోనే ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పుట్టపర్తి సత్యసాయి బాబా బోధనలతో విశ్వశాంతికి నెలవుగా నిలిచిన ఈ గడ్డ, ఇప్పుడు దేశ రక్షణ రంగంలో వ్యూహాత్మక కేంద్రంగా మారబోతోందని ఆకాంక్షించారు. దేశం గర్వించే ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాలను ఇక్కడే రూపొందించి, పరీక్షించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేవలం 36 రోజుల్లోనే ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు మంజూరు చేసి, యుద్ధ ప్రాతిపదికన భూ కేటాయింపులు పూర్తి చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రధాని మోడీ ఆకాంక్షించిన 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక భాగస్వామిగా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అంతేకాకుండా, ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న కల్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హెచ్ఎఫ్‌సీఎల్ సంస్థలకు చెందిన వివిధ రక్షణ ప్రాజెక్టుల శిలాఫలకాలను కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి వర్చువల్‌గా ఆవిష్కరించారు. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో ప్రత్యేకంగా 'డ్రోన్ సిటీ'ని ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఆధునిక యుద్ధ తంత్రంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని, అందుకే ఏపీని డ్రోన్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. ఇటీవల జరిగిన 'ఆపరేషన్ సింధూర్'లో వినియోగించిన డ్రోన్లు ఆంధ్రప్రదేశ్‌లోనే తయారై, పరీక్షించబడటం రాష్ట్ర ప్రతిభకు నిదర్శనమని ఆయన గర్వంగా చాటారు.
రాయలసీమ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెబుతూ, గతంలో 'రతనాల సీమ'గా ఉన్న ఈ ప్రాంతం కాలక్రమేణా కరవు కోరల్లో చిక్కుకుందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చేందుకు పారిశ్రామికీకరణను ఆయుధంగా మలచుకున్నామని వివరించారు. అనంతపురం జిల్లాలో ఇప్పటికే కియా వంటి అంతర్జాతీయ సంస్థకు నీరిచ్చి అభివృద్ధి చేశామని, అదే బాటలో ప్రస్తుతం లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులతో రాయలసీమను 'హార్టికల్చర్ హబ్'గా (ఉద్యానవన కేంద్రం) మార్చడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని వెల్లడించారు. ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు.
దేశానికి రక్షణ కవచంగా ఏపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశానికే రక్షణ, అంతరిక్ష కవచంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. శ్రీహరికోట 'అంతరిక్ష శక్తి'గా, నాగాయలంక 'క్షిపణి శక్తి'గా, విశాఖపట్నం 'నౌకాదళ శక్తి'గా ఇప్పటికే గుర్తింపు పొందాయని, ఇప్పుడు పుట్టపర్తి 'రక్షణ శక్తి'గా అవతరించడం ద్వారా ఏపీ సమగ్ర రక్షణ హబ్‌గా మారుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ భారీ ఏరోస్పేస్ ప్రాజెక్టు వల్ల స్థానికంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయని, దీనివల్ల రాయలసీమ యువతకు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆయన భరోసా ఇచ్చారు.
కేజీఎఫ్‌లా* *ఏపీలో* *జేజీఎఫ్
ఏపీకి మరో గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్. రాబోయే రోజుల్లో గోల్డ్ అంటే జేజీఎఫ్...జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్. దీనినుండి ఈ ఏడాది 600 కేజీల గోల్డ్ ఉత్పత్తి అవుతుంది. రానున్న రోజుల్లో గోల్డ్ తయారీకి చిరునామాగా ఏపీ తయారవుతుందని పుట్టపర్తి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ విన్నపాన్ని మన్నించి ఇంతటి భారీ వ్యూహాత్మక ప్రాజెక్టును కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డబుల్ ఇంజిన్ సహకారంతో ప్రాజెక్టు పనులను అత్యంత వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రక్షణ రంగంలో ఆంధ్రప్రదేశ్ చూపుతున్న చొరవ, దేశ భద్రతను పటిష్టం చేయడమే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరో మెట్టు ఎక్కిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుతో పుట్టపర్తి పేరు ప్రపంచ రక్షణ మ్యాప్‌లో శాశ్వతంగా నిలిచిపోనుంది.
శంకుస్థాపన కార్యక్రమానికి ముందు ఆమ్కా ప్రాజెక్టులో నిర్మితం కానున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ నమూనాతో పాటు భారత్ డైనమిక్స్ సహా వేర్వేరు సంస్థలు ఏర్పాటు చేసిన మిస్సైళ్లు, హ్యాండ్ గ్రెనేడ్ లు, టార్పెడో నమూనాలు, ఆధునిక తుపాకుల ప్రదర్శనను కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ తో కలిసి సీఎం తిలకించారు.
ఈ శంకుస్థాపనల కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, మంత్రులు టీజీ భరత్, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్య ప్రసాద్, సవిత, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఏపీ సలహాదారు సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
