Let's talk: editor@tmv.in
సముద్ర భద్రతే లక్ష్యం.. సింగపూర్‌కు భారత నౌక ‘ఐఎన్ఎస్ సునయన’
సముద్ర భద్రతే లక్ష్యం.. సింగపూర్‌కు భారత నౌక ‘ఐఎన్ఎస్ సునయన’
సముద్ర భద్రతే లక్ష్యం.. సింగపూర్‌కు భారత నౌక ‘ఐఎన్ఎస్ సునయన’
సముద్ర భద్రతే లక్ష్యం.. సింగపూర్‌కు భారత నౌక ‘ఐఎన్ఎస్ సునయన’

సముద్ర భద్రతే లక్ష్యం.. సింగపూర్‌కు భారత నౌక ‘ఐఎన్ఎస్ సునయన’

Shaik Mohammad Shaffee
29 ఏప్రిల్, 2026

భారత నౌకాదళానికి చెందిన ప్రతిష్టాత్మక నౌక 'ఐఎన్ఎస్ సునయన' (ఐఓఎస్ సాగర్) తన సముద్ర పర్యటనలో భాగంగా సింగపూర్‌లోని చాంగి నావికా కేంద్రానికి చేరుకుంది. భారత ప్రభుత్వం ప్రతిపాదించిన 'మహాసాగర్' (ప్రాంతీయ భద్రత మరియు అభివృద్ధి) లక్ష్యంలో భాగంగా చేపట్టిన ఈ యాత్రలో ఇది నాలుగో పోర్ట్ కాల్. వివిధ దేశాల మధ్య సముద్ర సంబంధాలను బలపరచడమే లక్ష్యంగా ప్రయాణిస్తున్న ఈ నౌక, తన పర్యటనను ముగించుకుని నేడు సింగపూర్ నుంచి తదుపరి గమ్యానికి బయలుదేరనుంది.

ఈ నౌక ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో భారత్‌తో పాటు మరో 16 మిత్ర దేశాలకు చెందిన 38 మంది నావికాదళ సిబ్బంది కలిసి పనిచేస్తున్నారు. సింగపూర్ చేరుకోవడానికి ముందు ఈ నౌక మాల్దీవుల రాజధాని మాలే, థాయ్‌లాండ్‌లోని ఫుకెట్, ఇండోనేషియాలోని జకార్తాల్లో పర్యటించింది. సింగపూర్ చేరుకున్న ఈ నౌకకు అక్కడి అధికారులు, భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పాక్ అంబులే ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన నౌకలోని సిబ్బందితో ముచ్చటించి, దేశాల మధ్య సముద్ర భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో వారి కృషిని అభినందించారు.

అమరవీరులకు నివాళులు.. భద్రతపై చర్చలు

నౌక కమాండింగ్ ఆఫీసర్ కమాండర్ సిద్ధార్థ్ చౌదరి సింగపూర్‌లోని క్రాంజి వార్ మెమోరియల్‌ను సందర్శించి, అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం సింగపూర్ నావికాదళ ఉన్నతాధికారి కల్నల్ చువా మెంగ్ సూన్‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య సముద్ర భద్రతను ఎలా మెరుగుపరచాలి, పరస్పర సహకారాన్ని ఎలా పెంచుకోవాలనే అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు.

సముద్ర సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవాలి

భారత రాయబారి డాక్టర్ శిల్పాక్ అంబులే మాట్లాడుతూ.. సముద్ర తీరాల్లో శాంతిని కాపాడటానికి, సముద్ర దొంగతనాలు, అక్రమ రవాణా వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి మిత్రదేశాలన్నీ 'ఒకే సముద్రం-ఒకే లక్ష్యం' అనే నినాదంతో కలిసి పనిచేయడం శుభపరిణామమని అన్నారు. 'మహాసాగర్' అనే విజన్‌తో భారత్ చేపట్టిన ఈ యాత్ర ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాతావరణానికి బాటలు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2026 సంవత్సరాన్ని ‘భారత్-ఆసియాన్ సముద్ర సహకార ఏడాది’గా జరుపుకుంటున్న తరుణంలో ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యత చేకూరింది.

నేడు తిరుగుపయనం

నౌక సింగపూర్‌లో ఉన్న సమయంలో పాఠశాల విద్యార్థులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు సందర్శనార్థం అనుమతినిచ్చారు. సముద్రంపై నావికుల జీవనశైలిని వారు ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్నారు. అలాగే ఏప్రిల్ 27న భారత సంతతి వారితో కలిసి ‘వన్ ఓషన్-వన్ మిషన్’ థీమ్‌తో భారీ పరుగు పందెం నిర్వహించారు. సింగపూర్ పర్యటన ముగించుకున్న అనంతరం ఈ నౌక మయన్మార్ (యాంగూన్), బంగ్లాదేశ్ (చిట్టగాంగ్), శ్రీలంక (కొలంబో) దేశాల మీదుగా ప్రయాణించి, మే నెల మధ్య నాటికి కేరళలోని కొచ్చి చేరుకోవడంతో ఈ భారీ సముద్ర విన్యాసం ముగుస్తుంది.