

మహారాష్ట్రలో మే 1 నుంచి మరాఠి తప్పనిసరి
మహారాష్ట్రలో ఆటో రిక్షా, టాక్సీ డ్రైవర్లకు మరాఠి భాషను తప్పనిసరి చేసే నిర్ణయాన్ని అమలు చేయడానికి మే 1 నుంచి ఆగస్టు 15 వరకు ప్రత్యేక తనిఖీ డ్రైవ్ చేపడుతున్నట్లు రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ తెలిపారు. ఈ డ్రైవ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 59 ఆర్టీవో కార్యాలయాల్లో నిర్వహిస్తున్నారు. అదనపు రవాణా కమిషనర్ రవీంద్ర గైక్వాడ్ నేతృత్వంలోని కమిటీ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించనుంది. మంత్రి మాట్లాడుతూ మహారాష్ట్రలో వ్యాపారం చేయాలంటే మరాఠి తెలుసుకోవడం అవసరమని స్పష్టం చేశారు. అయితే మరాఠి తెలియకుంటే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబోమని, కానీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇటీవల మీరా-భయందర్ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో 3,443 ఆటోలను పరిశీలించగా, 565 మంది డ్రైవర్లకు మరాఠి పరిజ్ఞానం లేనట్లు తెలిందని తెలిపారు. అయితే వారు భాష నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. మరాఠి నేర్చుకోవాలనుకునే డ్రైవర్లకు ఆర్టీవో కార్యాలయాల్లో ప్రత్యేక శిక్షణ సౌకర్యాలు కల్పించనున్నారు. ఈ శిక్షణకు కొంకణ్ మరాఠి సాహిత్య పరిషత్, ముంబై మరాఠి సాహిత్య సంఘ్ సహకారం అందించనున్నాయి. పుస్తకాలు, ఈ-మెటీరియల్ కూడా అందుబాటులో ఉంచనున్నారు.
శిక్షణ పూర్తి చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం సర్టిఫికెట్ ఇస్తుంది. భవిష్యత్తులో లైసెన్స్ రెన్యువల్ సమయంలో ఈ సర్టిఫికెట్ అవసరం అవుతుందని మంత్రి తెలిపారు.మరాఠి నేర్చుకోవాలనుకునే వారికి అవకాశం ఇవ్వడం మా సంప్రదాయం. కానీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎలాంటి రాజీ ఉండదని సర్నాయక్ హెచ్చరించారు. ఈ 100 రోజుల డ్రైవ్‌పై ఆగస్టు 16న సమగ్ర నివేదిక సమర్పించి, తదుపరి విధాన నిర్ణయాలు తీసుకోనున్నారు.
డ్రైవర్లకు మరాఠి తప్పనిసరి సరైనదే: సంజయ్ రౌత్
మహారాష్ట్రలో ఆటో, టాక్సీ డ్రైవర్లకు మరాఠి భాషను తప్పనిసరి చేసే నిర్ణయంపై శివసేన(ఉద్దవ్ ఠాక్రే) ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ఇతర రాష్ట్రాల్లో కూడా స్థానిక భాషలపై ఇలాంటి నిబంధనలు ఉన్నాయని, ఇదే విధానం మహారాష్ట్రలో అమలు చేస్తే సమస్య ఏంటని ప్రశ్నించారు. మంగళవారం పశ్చిమ బెంగాల్‌లో బెంగాళీ, గుజరాత్‌లో గుజరాతీ, కర్ణాటకలో కన్నడ, పంజాబ్‌లో పంజాబీ తప్పనిసరి. మహారాష్ట్రలో మరాఠి కోరితే ఎందుకు అభ్యంతరం? అని ఆయన అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మరాఠీని అవమానించడం పని చేయదు. స్థానిక భాష తెలిసి ఉండటం డ్రైవర్లకే ఉపయోగకరమని రౌత్ పేర్కొన్నారు.
గతంలో మంత్రి వాఖ్యలు
ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సర్నాయ్ ప్రకటించిన తాజా నిర్ణయం నేపథ్యంలో వచ్చాయి. మహారాష్ట్రవ్యాప్తంగా ఆటో, టాక్సీ డ్రైవర్లకు మరాఠి భాషలో చదవడం, రాయడం, మాట్లాడడం తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియలో భాగంగా మే 1 నుంచి డ్రైవర్ల పత్రాల పరిశీలనతో పాటు వారి మరాఠీ భాషా ప్రావీణ్యాన్ని కూడా పరీక్షించనున్నారు. నియమాలను పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ట్రేడ్ యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించి వారి సూచనలు స్వీకరించి అమలు చేస్తామని మంత్రి తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా లైసెన్స్‌ల జారీ ప్రక్రియలో ఉన్న లోపాలను కూడా సరిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే అక్కడ అనేక రాష్ట్రాల వారు తమ జీవానాధరంగా ఆటోలను నడుపుతున్నారు. వారి నుంచి ఎటువంటి అభిప్రాయం వస్తుందో వేచి చూడాల్సిందే.
