Let's talk: editor@tmv.in
అమెరికాలో ఉన్మాది కాల్పులు.. 8 మంది చిన్నారుల మృతి
అమెరికాలో ఉన్మాది కాల్పులు.. 8 మంది చిన్నారుల మృతి
అమెరికాలో ఉన్మాది కాల్పులు.. 8 మంది చిన్నారుల మృతి

అమెరికాలో ఉన్మాది కాల్పులు.. 8 మంది చిన్నారుల మృతి

Shaik Mohammad Shaffee
21 ఏప్రిల్, 2026

అమెరికాలో గన్ కల్చర్ మరోసారి పడగవిప్పింది. లూసియానా రాష్ట్రంలోని ష్రెవ్‌పోర్ట్ నగరంలో ఆదివారం తెల్లవారుజామున ఒక ఉన్మాది జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఏడాది వయస్సు నుంచి 14 ఏళ్ల లోపు ఉన్న పసిపిల్లలను కూడా చూడకుండా నిందితుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దారుణ ఘటనలో మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. గత రెండేళ్లలో అమెరికాలో జరిగిన అత్యంత భయానక సామూహిక కాల్పుల ఘటనల్లో ఇది ఒకటిగా నిలిచింది.

కుటుంబ కలహాలే కారణమా?

పోలీసుల కథనం ప్రకారం.. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల మధ్య తలెత్తిన వివాదమే ఈ కాల్పులకు కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఆదివారం సూర్యోదయానికి ముందే ఈ దారుణం మొదలైంది. తొలుత ఒక ఇంట్లో మహిళపై కాల్పులు జరిపిన నిందితుడు, అక్కడి నుంచి మరో ఇంటికి వెళ్లి అక్కడ ఉన్న చిన్నారులను లక్ష్యంగా చేసుకున్నాడు. మరణించిన ఎనిమిది మంది చిన్నారుల్లో ఏడుగురు రెండో ఇంట్లోనే శవాలై పడి ఉండటం చూసి పోలీసులు నిశ్చేష్టులయ్యారు.

ఈ ఘటనలో చిన్నారులు ప్రాణాలు కాపాడుకోవడానికి పడిన ఆరాటం వర్ణనాతీతం. నిందితుడి బారి నుంచి తప్పించుకోవడానికి ఒక చిన్నారి ఇంటి వెనుక తలుపుల నుంచి బయటకు పరిగెత్తగా, మరో బాలుడు భయంతో ఇంటి పైకప్పు (రూఫ్) మీదకు ఎక్కాడు. అయితే ఉన్మాది వదలకుండా కాల్పులు జరపడంతో ఆ చిన్నారి అక్కడే ప్రాణాలు విడిచాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు ఆ చిన్నారి మృతదేహం పైకప్పుపైనే ఉండటం చూసి అధికారులు కన్నీటి పర్యంతమయ్యారు.

నిందితుడి మృతి

కాల్పుల అనంతరం నిందితుడు తుపాకీ చూపి ఒక వాహనాన్ని హైజాక్ చేసి పరారయ్యాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమై అతడిని వెంబడించారు. ఛేజింగ్ సమయంలో పోలీసులు నిందితుడిపై ఎదురుకాల్పులు జరిపారు. చివరకు నిందితుడు మరణించినట్లు పోలీసులు ధృవీకరించారు. నిందితుడు మృతులకు బంధువేనని, కొన్ని రోజుల క్రితమే ఆ పిల్లలతో కలిసి ఆడుకుంటూ కనిపించాడని స్థానికులు చెబుతున్నారు.

దిగ్భ్రాంతిలో ష్రెవ్‌పోర్ట్ నగరం

"నా సుదీర్ఘ సర్వీసులో ఇలాంటి హృదయ విదారక దృశ్యాన్ని ఎప్పుడూ చూడలేదు. మనసు కలచివేస్తోంది" అని ష్రెవ్‌పోర్ట్ పోలీస్ చీఫ్ వేన్ స్మిత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై లూసియానా గవర్నర్ జెఫ్ లాండ్రీ, అమెరికా హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం లూసియానా స్టేట్ పోలీసులు, డిటెక్టివ్‌లు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. స్థానికుల వద్ద ఉన్న సీసీటీవీ దృశ్యాలను సేకరిస్తున్నారు. గాయపడిన మహిళల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో సుమారు 1.8 లక్షల జనాభా ఉన్న ష్రెవ్‌పోర్ట్ నగరం శోకసంద్రంలో మునిగిపోయింది.

అమెరికాలో ఉన్మాది కాల్పులు.. 8 మంది చిన్నారుల మృతి - Tholi Paluku