

వాట్సాప్‌లో ‘మన మిత్ర’కు భక్తుల ఆదరణ.. ఏపీ దేవాలయాలకు రూ.22.2 కోట్ల ఆదాయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ గవర్నెన్స్ కార్యక్రమం ‘మన మిత్ర’ వాట్సాప్ సేవలు భక్తులకు మరింత చేరువవుతున్నాయి. ఈ వేదిక ద్వారా ఎండోమెంట్స్ శాఖ పరిధిలోని 21 ప్రధాన దేవాలయాలకు ఇప్పటివరకు రూ.22.2 కోట్లకు పైగా ఆదాయం సమకూరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దర్శనం, సేవా టికెట్ల బుకింగ్‌తో పాటు విరాళాల స్వీకరణలో కూడా ఈ ప్లాట్‌ఫారమ్ కీలక పాత్ర పోషిస్తోంది.
ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, దేవాలయ సేవలను సులభతరం చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ‘మన మిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ సేవలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రస్తుతం మొత్తం దర్శనం, సేవా టికెట్ బుకింగ్‌లలో దాదాపు 30 శాతం బుకింగ్‌లు ఈ డిజిటల్ వేదిక ద్వారానే జరుగుతున్నాయి.
ఒక్క నెలలోనే రూ.13 కోట్ల ఆదాయం
మే 11 నుంచి జూన్ 11 వరకు కేవలం ఒక నెల వ్యవధిలోనే సుమారు రూ.13 కోట్ల ఆదాయం ‘మన మిత్ర’ ద్వారా లభించడం విశేషం. భక్తులు దేవాలయాలకు వెళ్లకుండానే తమ మొబైల్ ఫోన్‌లో వాట్సాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవడం, సేవలకు నమోదు చేసుకోవడం, ఈ-హుండీ ద్వారా విరాళాలు అందించడం వంటి సేవలను విస్తృతంగా వినియోగిస్తున్నారు.
క్యూలకు చెక్.. భక్తులకు సౌకర్యం
‘మన మిత్ర’ ద్వారా భక్తులు దర్శనం, ప్రత్యేక సేవల టికెట్లతో పాటు తలనీలాల సమర్పణ సేవలను కూడా ముందుగానే బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో దేవాలయాల్లో గంటల తరబడి క్యూలలో నిలబడాల్సిన అవసరం తగ్గింది.
అధికారిక వాట్సాప్ నంబర్: 95523 00009 ఈ నంబర్‌కు కేవలం వాట్సాప్‌లో “Hi” అని సందేశం పంపడం ద్వారా దేవాలయ సమాచారం, టికెట్ల లభ్యత, సేవల వివరాలు తెలుసుకుని వెంటనే బుకింగ్ చేసుకునే వీలుంది.
టికెట్ బుక్ చేసిన వెంటనే పీడీఎఫ్ రూపంలో టికెట్ మొబైల్‌కు అందుతుంది. ఈ విధానం వల్ల భక్తులకు సమయం ఆదా కావడంతో పాటు ప్రయాణ ప్రణాళికలు సులభమవుతున్నాయి.
అత్యధిక ఆదాయం సాధించిన దేవాలయాలు
‘మన మిత్ర’ ద్వారా అత్యధిక ఆదాయం సాధించిన దేవాలయాల్లో శ్రీకాళహస్తి శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవాలయం అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఆలయానికి బుకింగ్‌లు, విరాళాల రూపంలో రూ.3.3 కోట్లకు పైగా ఆదాయం లభించింది. తరువాతి స్థానాల్లో, అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం – రూ.2 కోట్లకు పైగా, శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం – రూ.1.7 కోట్లకు పైగాద్వారకా తిరుమల శ్రీ వెంక, టేశ్వర స్వామి దేవస్థానం – రూ.1.5 కోట్లకు పైగా, విజయవాడ శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి దేవాలయం – రూ.1.53 కోట్లకు పైగా, సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం – రూ.1 కోట్లకు పైగా ఆదాయం నమోదు చేశాయి.
ఇతర పలు దేవాలయాలు కూడా డిజిటల్ బుకింగ్‌లు, విరాళాల ద్వారా గణనీయమైన వృద్ధిని నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ప్రత్యేక సేవా కేంద్రాల ఏర్పాటు
భక్తుల సౌకర్యాన్ని మరింత పెంచేందుకు కొన్ని ప్రధాన దేవాలయాల్లో ప్రత్యేక ‘మన మిత్ర సేవా కేంద్రాలు’ ఏర్పాటు చేశారు. ఈ వేదిక ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ప్రత్యేక కౌంటర్లు, ప్రత్యేక దర్శన క్యూలైన్లు అందుబాటులో ఉంచారు. దీంతో దర్శనం మరింత వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.
డిజిటల్ గవర్నెన్స్‌కు ఆదర్శంగా ‘మన మిత్ర’
ప్రభుత్వం అభిప్రాయం ప్రకారం, ‘మన మిత్ర’ కేవలం టికెట్ బుకింగ్ వేదిక మాత్రమే కాకుండా డిజిటల్ గవర్నెన్స్‌ను ప్రజలకు చేరువ చేసే సమర్థవంతమైన సాధనంగా మారింది. దేవాలయ సేవలను పారదర్శకంగా, సులభంగా అందించడంతో పాటు ఆదాయాన్ని కూడా పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది. భవిష్యత్తులో మరిన్ని దేవాలయాలను ఈ సేవల పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. భక్తుల్లో అవగాహన పెరుగుతున్న కొద్దీ ‘మన మిత్ర’ వినియోగం మరింత విస్తరించి, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ గవర్నెన్స్ వ్యవస్థకు కొత్త బలాన్ని అందిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అందుబాటులో ఉన్న ముఖ్యమైన సేవలు
ప్రారంభంలో 161 సేవలతో మొదలైన ఈ ప్లాట్‌ఫారమ్, ప్రస్తుతం 36 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 1,000 కి పైగా డిజిటల్ సేవలను పౌరులకు అందిస్తోంది.
రెవెన్యూ సేవలు : కుల ధృవీకరణ పత్రాలు, ఆదాయ ధృవీకరణ పత్రాలు, ఓబీసీ సర్టిఫికెట్లు, ఈడబ్ల్యూఎస్ పత్రాలు పొందవచ్చు.
భూమి రికార్డులు : పట్టాదారు పాసుపుస్తకాలు , 1-బీ అడంగల్ కాపీలు, ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పన్నుల చెల్లింపులు : మున్సిపాలిటీ లేదా పంచాయితీ పరిధిలోని ఆస్తి పన్ను, నీటి పన్ను, కరెంటు బిల్లుల చెల్లింపులు చేయవచ్చు.
విద్యార్థుల సేవలు : ప్రభుత్వ ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లు, ఫలితాలు, మార్కులిస్టులు డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కలదు,
ప్రయాణ సేవలు : ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సు టికెట్ల రిజర్వేషన్ బుకింగ్ చేసుకోవచ్చు.
దేవాలయాల సేవలు : తిరుమలతో పాటు శ్రీశైలం, శ్రీకాళహస్తి, విజయవాడ దుర్గమ్మ, సింహాచలం, అన్నవరం వంటి 21 ప్రధాన దేవాలయాల దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, గదుల బుకింగ్ ఈ-హుండీ కానుకలు సమర్పించవచ్చు.
